స్పైడర్‌ మ్యాన్‌ ముద్దంటే తెలుసా?

ముద్దు ముచ్చట్లంటే హద్దుల్లేకుండా ఎగబడతారు కుర్రజనం. కానీ ప్రతి ముద్దుకూ ఓ అర్థం ఉందనే సంగతి ఎంతమందికి తెలుసు? ఆ చుంబనం తీరు..

Updated : 24 Mar 2024 11:57 IST

ముద్దు ముచ్చట్లంటే హద్దుల్లేకుండా ఎగబడతారు కుర్రజనం. కానీ ప్రతి ముద్దుకూ ఓ అర్థం ఉందనే సంగతి ఎంతమందికి తెలుసు? ఆ చుంబనం తీరు.. అందుకునే వ్యక్తులను బట్టి.. ఆ అర్థం మారిపోతుందంటున్నారు లవ్‌గురూలు. ఆ సంగతులేంటో తెలుసుకుందామా..


చెంపపై ముద్దు: చెంపపై పెట్టే ముద్దుకు చాలానే అర్థాలున్నాయి. గాఢమైన కోరిక, ప్రేమ, ప్రోత్సాహం, అభిమానం.. ఇలా ఏమైనా వెతుక్కోవచ్చు. ఈ ముద్దు జంటల మధ్యే కాదు.. కన్నవాళ్లు, తోబుట్టువులు, సన్నిహితుల మధ్యా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ప్రేమ, ఆప్యాయతను తెలియజేస్తుందే తప్ప శృంగార భావనకు సంబంధించినది అస్సలు కాదు.


నుదిటిపై ముద్దు: కష్టాల్లో, సుఖాల్లో.. సర్వకాలాల్లో నేను నీకు తోడున్నా.. అని భరోసా ఇచ్చే ముద్దు ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, గౌరవం, వాత్సల్యం, ప్రోత్సాహం.. ఇలా రకరకాలుగా ఇచ్చే ఈ ముద్దుకు ఎన్నెన్ని అర్థాలో.


ఎస్కిమో ముద్దు: ముక్కూ ముక్కూ రాపాడించుకోవడం ఈ ముద్దు లక్షణం. ఎస్కిమోలే మొదలు పెట్టినా.. ఎస్కిమోలంతా ఇలాగే ముద్దులాడుకుంటారని కాదు. ఇది ప్రేమాప్యాయతలు, గౌరవం, గాఢానుబంధం తెలియజేసేదే తప్ప ప్రేమికులు, భాగస్వాములు పెట్టుకునే ముద్దులాంటిది కాదు.


ఒంటి పెదవితో ముద్దు: ఇది ప్రేమికులకు అత్యంత ఇష్టమైన ముద్దు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని, గాఢతను, ప్రేమను వెలిబుచ్చాలనుకునే పడుచు జంటలు మోజు పడే ముద్దు. తనువు, మనసూ మైకంతో పెనవేసుకునే ముద్దు.


ఫ్రెంచ్‌ కిస్‌: జగమెరిగిన చుంబనం ఇది. తనువుల తమకంతో అమ్మాయి, అబ్బాయి రొమాన్స్‌కి ముందు ఎంచుకునే ముద్దు ఇది. కొత్త జంటలు, పెళ్లితో జట్టు కట్టిన పడుచుప్రాయులు ఎంచుకునే మార్గం.


మెడపై ముద్దు: తనువుల్ని తమకంగా స్పృశించడమే కాదు.. కాస్త మోటుదనానికీ ఇందులో చోటు ఉంటుంది. బహుకాలపు ప్రేమికులు, ఆలుమగల మధ్య తరచూ కుదిరే చుంబనం ఇది.


గాల్లోకి విసిరే ముద్దు: అమ్మాయి, అబ్బాయి పక్కపక్కనే కాకుండా.. కనుచూపుమేరలో దూరంగా ఉన్నప్పుడు పడుచు జంట విసురుకునే విరహపు ముద్దు. పక్కింటి బాల్కనీలోనో.. అప్పటిదాకా పక్కనే ఉండి దూరంగా వెళ్లిపోతున్నప్పుడో ఒకరికొకరు విసురుకునే చుంబనం ఇది.


చేతిపై ముద్దు: గౌరవం, హుందాతనం, విశ్వసనీయతతో కూడుకున్న ముద్దు. ఇందులో తనువుల తపన కన్నా మనసుల కలయికకే ప్రాధాన్యం. అమ్మాయి లేదా అబ్బాయి తాము ఇష్టపడ్డ వారికి పెళ్లి ప్రపోజ్‌ చేయాలనుకున్నప్పుడు ఇచ్చే ముద్దు ఇది.


బటర్‌ఫ్లై ముద్దు: తనువుని తాకీ తాకనట్టుగా.. పెదాలతో స్పర్శించే ముద్దు. ఈ సమయంలో జంట మరీ సన్నిహితం అవుతుంటారు.


స్పైడర్‌మ్యాన్‌ ముద్దు: స్పైడర్‌మ్యాన్‌ సినిమా చూసి ఉంటే ఈపాటికే ఈ ముద్దు తీరేంటో అర్థమైపోతుంది. ఇద్దరిలో ఎవరైన ఒకరు తలకిందులుగా వేలాడుతున్నా.. బెడ్‌పై పడుకున్నా.. ఇంకొకరు తమకంతో అపోజిట్‌గా ఉండి పెట్టే రొమాంటిక్‌ ముద్దు.


వాంపైర్‌ కిస్‌: తమ ప్రేమ గాఢతలో మోటుదనం మేళవించి పడుచు జంటలు పెట్టుకునే ముద్దు ఇది. పెదాలు, చెంపలు, మెడ.. ఎక్కడైనా పెట్టొచ్చు. ఆ సమయంలో కోర్కెల వేడికి ఒంటిపై గాట్లు కూడా పడొచ్చు.


టీజర్‌ ముద్దు: తనువులో వేడి పెంచుతూ.. జంటల్ని శృంగారానికి సిద్ధం చేసేలా సమాయత్తం చేసే చుంబనం ఇది. పాదం నుంచి అధరం దాకా.. ఎక్కడైనా ముద్దులతో నింపేస్తుంటారు.


బాడీ కిస్‌: ఈ ముద్దుకూ ఆపాదమస్తకమూ స్థావరమే. ముఖ్యంగా అబ్బాయిలు చొరవ తీసుకొని అమ్మాయిలకు పెట్టే ముద్దు ఇది. అత్యంత సన్నిహితమైన జంటలు మాత్రమే దీన్ని ఎంచుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని