మరీ.. ఒక్క మార్కేంట్రా?

ఆరేళ్ల కిందట నేను డిగ్రీలో ఉండగా జరిగిందీ సంఘటన. ఓరోజు మా కెమిస్ట్రీ లెక్చరర్‌ చాలా కోపంగా తరగతికొచ్చారు. ఆయన చేతిలో అంతకుముందు మేం రాసిన పరీక్ష పేపర్లు ఉండటంతో సీన్‌ అర్థమైంది. ‘వెధవల్లారా.. అసలు మీకేమైంది? అందరికీ తక్కువ మార్కులొచ్చాయి’ అంటూ మొదలెట్టారు.

Published : 30 Mar 2024 00:04 IST

క్లాస్‌రూం కహానీ

రేళ్ల కిందట నేను డిగ్రీలో ఉండగా జరిగిందీ సంఘటన. ఓరోజు మా కెమిస్ట్రీ లెక్చరర్‌ చాలా కోపంగా తరగతికొచ్చారు. ఆయన చేతిలో అంతకుముందు మేం రాసిన పరీక్ష పేపర్లు ఉండటంతో సీన్‌ అర్థమైంది. ‘వెధవల్లారా.. అసలు మీకేమైంది? అందరికీ తక్కువ మార్కులొచ్చాయి’ అంటూ మొదలెట్టారు. తర్వాత రోల్‌నెంబర్‌ ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తూ.. మార్కులు చెబుతూ ఆన్సర్‌షీట్‌ ఇవ్వసాగారు. నలుగురైదుగురివి అయ్యాక నా క్లోజ్‌ఫ్రెండ్‌ అభిరామ్‌ వంతు వచ్చింది. ‘ఏంట్రా ఇది? అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా? మూడే మూడు మార్కులు వస్తాయా?’ అని ఆపకుండా ఐదు నిమిషాలు తిట్టి పేపరు చేతిలో పెట్టారు. దెబ్బకి మావాడి మొహం వాడిపోయింది. తన సీట్లోకి వచ్చి చూసుకుంటే అది మావాడి పేపర్‌ కాదు. వాడు వెంటనే రోషంగా లేచి నిలబడి ‘సర్‌.. ఈ పేపర్‌ నాది కాదు. నన్ను అనవసరంగా తిట్టారు’ అన్నాడు. దాంతో సర్‌ నాలిక కరుచుకున్నారు. సారీ చెప్పారు. అనవసరంగా తిట్టానని చాలా సేపు బుజ్జగించారు. ఆఖర్లో మళ్లీ మావాడి నెంబర్‌ వచ్చింది. అప్పుడు వచ్చింది అసలైన ట్విస్ట్‌. ఈసారి తనకొచ్చింది ఒకే ఒక మార్కు. ‘మరీ.. ఒక్క మార్కేంట్రా..? ఇప్పుడు నిన్ను ఏమని తిట్టాలి?’ అంటూ తల పట్టుకున్నారు. ఇక క్లాసులో నవ్వులే నవ్వులు.

ఆర్‌.ప్రణయ్‌, నిజామాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని