రణ్‌వీర్‌లా ప్రేమను పంచేద్దాం

జపాన్‌లో అయితే యువ తండ్రులకు 57శాతం వేతనంతో ఏకంగా  ఏడాది సెలవులిస్తాయి అక్కడి కంపెనీలు. మన దగ్గర కొన్ని సంస్థలు 15రోజులు సెలవులిస్తుంటే.. సిక్కిం ప్రభుత్వం మాత్రం ఏకంగా వేతనంతో నెల రోజుల సెలవులు మంజూరు చేస్తోంది.

Updated : 13 Apr 2024 02:38 IST

మంచి ఫామ్‌లో ఉన్నాడు.. చేతినిండా సినిమాలున్నాయి. అయినా ఓ ఏడాది ఇంట్లోనే ఉంటానని ప్రకటించాడు స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌. ఎందుకిలా అంటే పెటర్నిటీ లీవ్‌ అన్నది సమాధానం. తొలి సారి తల్లి కాబోతున్న అర్ధాంగి దీపిక పదుకొణె పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవడానికి.. తండ్రయ్యే అపురూప క్షణాల్ని ఎంజాయ్‌ చేయడానికి.. కోట్ల రూపాయల సంపాదన సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యాడు రణ్‌వీర్‌. పెటర్నిటీ లీవ్‌ అంటే ఒకప్పుడు వింతగా చూసేవారు జనం. ఇప్పుడు అది పనిలో విరామం మాత్రమే కాదు.. యంగ్‌ జనరేషన్‌కి ఒక ఎమోషన్‌. ఇదొక్కటేనా..? తొలిసారి తండ్రి అయిన కుర్రాళ్లు ఎక్కువ సమయం తన కలల పంటతో గడిపితే.. మానసికంగా బలవంతులు అవుతారని కాలిఫోర్నియాకు చెందిన సాక్స్‌బే అనే శాస్త్రవేత్త పరిశోధన చేసి మరీ చెప్పారు. మనదగ్గర ఈ ట్రెండ్‌ ఇంకా ఊపందుకోలేదుగానీ.. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పితృత్వపు సెలవులకు ప్రాధాన్యం ఎక్కువ.


జపాన్‌లో అయితే యువ తండ్రులకు 57శాతం వేతనంతో ఏకంగా  ఏడాది సెలవులిస్తాయి అక్కడి కంపెనీలు. మన దగ్గర కొన్ని సంస్థలు 15రోజులు సెలవులిస్తుంటే.. సిక్కిం ప్రభుత్వం మాత్రం ఏకంగా వేతనంతో నెల రోజుల సెలవులు మంజూరు చేస్తోంది. ఇంతలా జనాల్ని దగ్గరవుతున్న ఈ ట్రెండ్‌తో అసలింతకూ ఏం ప్రయోజనాలున్నాయంటే..

  •  కేర్‌మన్న పురుటిగుడ్డుని కుర్ర తండ్రి పొత్తిళ్లలోకి తీసుకోవడం ఓ అపురూప క్షణం. తొలి స్పర్శ, ముద్దూముచ్చట్లు.. ఇద్దరి మధ్యా అనుబంధాన్ని దృఢం చేయడానికి తొలి మెట్టుగా ఉపయోగ పడుతుంది. ఇక్కడితో మొదలైన సానుకూల ప్రయాణం తండ్రీ పిల్లల మధ్య ప్రేమ పెరిగేలా చేస్తాయి.
  •  మొదటిసారి తల్లి అయిన అమ్మాయిలు పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లో ఉంటారు. ఈ సమయంలో వాళ్లకి మానసికంగా అండగా నిలవడానికి, ఒత్తిడి తగ్గించడానికి పెటర్నిటీ సెలవులు చక్కగా ఉపయోగపడతాయి. పిల్లల బాధ్యత తల్లిదండ్రులిద్దరిదీ అనే వాదనకు న్యాయం కూడా చేకూరుతుంది.

  •  ఆఫీసులో కంప్యూటర్లు, ఫైళ్లతో కుస్తీ పట్టడమే కాదు.. కుర్ర డాడీలకు కొత్త బాధ్యతలు మొదలవుతాయి. బేబీ డైపర్లు మార్చడం, పాలు పట్టడం, స్నానం చేసేటప్పుడు సాయం చేయడం.. ఇలాంటివి ఆఫీసు పనిలో ఓపిక పెరిగేలా చేస్తాయి.
  •  అమ్మాయిలు మాతృత్వపు సెలవుల్ని ఉపయోగించు కుంటున్నప్పుడు.. మగానుభావులు మాత్రం ఎందుకు తమ హక్కుల్ని వదులుకోవాలి. ఇలా చేయడం బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే తమ హకుల్ని కాపాడుకునే ఓ మార్గం కూడా అవుతుంది.
  •  తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న మగాళ్లకి ఈ సెలవులు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అప్పుడే పుట్టిన పాప లేదా బాబు, భార్యతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవడానికి సైతం ఈ సమయం ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని