ముప్పైలో.. మురిసేలా

ఒంటిపైకి మూడు పదులు వచ్చాయంటే.. యవ్వనం సగం కరిగిపోయినట్టే..ఏం సాధించాం? అన్న సంగతి పక్కనపెడితే ఇదిగో.. కనీసం వీటిపై అయినా పట్టు ఉండాల్సిందే.

Published : 20 Apr 2024 00:03 IST

ఒంటిపైకి మూడు పదులు వచ్చాయంటే.. యవ్వనం సగం కరిగిపోయినట్టే..ఏం సాధించాం? అన్న సంగతి పక్కనపెడితే ఇదిగో.. కనీసం వీటిపై అయినా పట్టు ఉండాల్సిందే.

  • జీవితం ఎవరికీ కేక్‌వాక్‌ కాదు.. క్యాట్‌వాక్‌ అసలే కాదు. దారిలో ముళ్ల కంచెల్ని ఒడుపుగా దాటడం రావాలి. కష్టాల సాగరాల్ని ఈదగలగాలి. సర్దుకుపోవడం వచ్చి ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే ఆత్మస్థైర్యం అలవరచుకోవాలి.
  • నెట్‌వర్కింగ్‌.. మార్కెటింగ్‌.. ఈ రెండే ఇప్పుడు ఎదగడానికి సోపానాలు. బంధాలు బలపడేలా అనుబంధాలు పెంచుకోవడం.. వృత్తిగత, వ్యాపారానికి నెట్‌వర్కింగ్‌ పెంచుకోవడం ఇవి తెలిసి ఉండాలి. కన్నవాళ్లు ఇచ్చిన బంధుత్వాలు కాకుండా.. నెట్‌వర్కింగ్‌, మార్కెటింగ్‌తో మీకంటూ కొందరు ఆప్తులు ఉండాలి. కెరియర్‌లో ఓ స్థానానికి వచ్చి ఉండాలి.
  • కెరియర్‌లో కుదురుకోవడానికి పాతికేళ్లు సరిపోతే.. ఆఫీసు, ఇంటి బాధ్యతల్ని బ్యాలెన్స్‌ చేసే స్థితిలో ముప్ఫైలో ఉండగలగాలి. ఇంట్లోని చికాకులు ఆఫీసుకి.. అక్కడి అగచాట్లు ఇంటికి తీసుకొస్తే.. అనుబంధాలు, వృత్తిగత బాధ్యతలకు చేజేతులా చిల్లు పెడుతున్నట్టే.
  • పడుచు కుర్రాడు ఫోన్‌ వదలడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ అమ్మాయి కంప్యూటర్‌కే అతుక్కుపోతోంది అంటే ఫర్వాలేదనుకోవచ్చు. కానీ మూడు పదుల ప్రౌఢలు డిజిటల్‌ బానిసలైతే కష్టం. గ్యాడ్జెట్లను వదిలి ఏదైనా పనికొచ్చే వ్యాపకం ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం.. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం.. ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే.
  • సంతోషం వస్తే కేరింతలు కొట్టడానికి.. కష్టాల్లో ఒత్తిడిలో కూరుకుపోవడానికి మీరేం టీనేజీ పిల్లలు కాదు. ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ పెంచుకొని.. భావోద్వేగాలపై పట్టు సాధించాలి. మరీ రాయిలా మారకపోయినా ఫర్వాలేదుగానీ.. అతిగా భావోద్వేగాలకు గురికాకుండా ఉండేలా నియంత్రించుకోవాలి.
  • ఇప్పటికే ఆర్థిక విషయాల్లో పక్కా ప్రణాళిక ఉండాలి. అప్పులు, ఆర్థిక కుదుపుల్లేకుండా ఓ స్థాయికి రావాలి. సొంతిల్లు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌, పొదుపు.. వీటన్నింటిపై స్పష్టతతో ఉండాలి. ఈ వయసులో స్థిరపడగలిగితేనే.. భవిష్యత్తులో ఊహించని కష్టాలను తట్టుకోగలిగే ఆర్థిక శక్తి ఉంటుంది.
  • ఇది సాహసాలు చేయడానికి సరైన వయసు. కంఫర్ట్‌జోన్‌లో కూర్చొని ఉన్నదాంతో సర్దుకుంటానంటే కుదరదు. రిస్కు తీసుకోవాలి.. ప్రయోగాలకు ముందుండాలి. సొంత వ్యాపారం, స్టార్టప్‌, ఉద్యోగం మారడం.. ఒంటరి ప్రయాణాలు.. అన్నిసార్లూ మంచి ఫలితాలు ఇవ్వకున్నా.. వెలకట్టలేని అనుభవాన్నిస్తాయి. తర్వాత అడుగు జాగ్రత్తగా పడేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని