Online Friendship: పంచుకుంటే పలచనవుతాం
తన అందాన్ని పొగిడించుకోవాలనే యావ అఖిలది. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ అబ్బాయికి రకరకాల ఫొటోలు పంపింది. ఆరాధిస్తాడు అనుకుంటే.. తను ఆ చిత్రాల్ని మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టేశాడు.
తన అందాన్ని పొగిడించుకోవాలనే యావ అఖిలది. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ అబ్బాయికి రకరకాల ఫొటోలు పంపింది. ఆరాధిస్తాడు అనుకుంటే.. తను ఆ చిత్రాల్ని మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టేశాడు.
అందంగా ఉన్న ఓ అమ్మాయి రీల్స్‌కి అదే పనిగా లైక్‌లు కొడుతూనే ఉన్నాడు కిరణ్. అతగాడి ఆసక్తి కనిపెట్టి పరిచయం పెంచుకుందామె. పెళ్లి మాటలు చెప్పి.. బ్యాంక్ ఖాతా వివరాలు పట్టేసి.. లక్షలు కొట్టేసిందా కిలేడీ!
కార్తీక్‌ది ఉన్నత స్థాయి ఉద్యోగం. రోజూ తీరిక లేనంత పని. భర్త పట్టించుకోవడం లేదనే భావనలో ఉండేది అతడి అర్ధాంగి. ఇదే సమయంలో ఆమెతో మాటలు కలిపాడో స్నేహితుడు. నమ్మి చనువుగా ఉంటే.. కొన్నాళ్లు బాగానే ఉండి తర్వాత బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.
ఈ సంఘటనలు ఇటీవల జరిగినవే. బయటికి రానివి కోకొల్లలు. బాధలు పంచుకోవాలనో.. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోలేకో.. అపరిచితులు, పరిచయస్థులతో వ్యక్తిగత వివరాలు పంచుకుంటూ.. అనుబంధాలు పెంచుకుంటూ.. చిక్కుల్లో పడుతోంది నేటి యువత. అప్రమత్తత, జాగ్రత్తే.. దీనికి పరిష్కారం అంటున్నారు నిపుణులు.
స్నేహం, ప్రేమ, రిలేషన్‌షిప్ ఇప్పటి యువతకి చిటికెలో పని. సామాజిక మాధ్యమాలు అందుకు ప్రధాన వేదికలవుతున్నాయి. అయితే సోషల్ మీడియా అంటే సరదాల లోకమే కాదు.. ఇక్కడ వలపు వేటగాళ్లు పొంచి ఉంటారు. మానసిక బలహీనులపై కన్నేస్తుంటారు. ప్రేమ, సాన్నిహిత్యం మైకంలో ముంచేసి ఉన్నదంతా ఊడ్చేస్తారు. గుట్టుగా ఉండే జీవితాల్ని రట్టు చేసి బజారుకీడుస్తారు. అందుకే ప్రతి విషయాన్నీ పరులతో పంచుకుంటే పలచనైపోతాం. జీవితాన్ని చేజేతులా చిక్కుల్లోకి నెట్టేసుకుంటాం. షేర్‌ఖాన్‌లు, షేర్‌క్వీన్‌లు పారాహుషార్.. మీ ఫొటోలు.. గోప్యంగా ఉండాల్సిన సమాచారం.. వ్యక్తిగత వివరాలు.. పంచుకునే ముందు ఒక్కసారి దాంతో జరగబోయే విపరిణామాల్ని ఊహించుకోండి.
ఏమిటీ వైపరీత్యం?
అసలు పక్కవాడితో పాప్‌కార్న్ కూడా పంచుకోలేని మనం.. ముఖ పరిచయం లేనివాళ్లతో.. జీవితంలో జరిగిన ఫన్నీ సంగతుల నుంచి మొదలుకొని పడక గది ముచ్చట్లదాకా అన్నీ ఎందుకు పంచుకుంటాం? కాస్త చనువు పెరగగానే వాళ్లతో అనుబంధాల బందీ ఎందుకవుతాం? యువతలోనే ఈ ధోరణి ఎక్కువ ఎందుకని? ఇదే విషయం మానసిక నిపుణులను అడిగితే.. అపరిచితులు, పరిచయస్థులు, సన్నిహితులు.. ఎవరితోనైనా ఒక విషయం పంచుకోవడం వెనకాల సైకాలజీ ఉందంటున్నారు. ఇతరులకన్నా మేం గొప్పగా స్థితిలో ఉన్నామని చెప్పుకోవడానికి.. నన్ను గుర్తించాలనే తాపత్రయం.. భావోద్వేగాలు పంచుకోవడానికి.. సమాచారం సంపాదించడానికి.. తమ ప్రతిభ ప్రదర్శించడానికి.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో ఇతరులకు దగ్గర అవుతుంటారు అంటున్నారు నిపుణులు. కోపం, కసి, బాధ, సంతోషం, ఆందోళన, భయం.. ఇలాంటి ప్రతి భావోద్వేగం చల్లారడానికీ పక్కచూపులు చూస్తుంటారట. ఓ డేటింగ్ యాప్ అధ్యయనం ప్రకారం ఇండియాలో.. ఆన్‌లైన్‌లో పరిచయమైన అమ్మాయిలు, అబ్బాయిలు సగటున ఇరవై రెండు రోజుల్లోనే శృంగార విషయాలు సైతం యథేచ్ఛగా చర్చించుకునే దశ వరకూ వెళ్లిపోతున్నారట. ఇది ఎంతటి అనర్థాలకు కారణం అవుతుందో చెప్పాల్సిన పనేముంది?
జాగ్రత్త పడదామిలా..
మనిషి సంఘజీవి. ఇతరులతో కలిసి బతకాల్సిందే. అవతలి వ్యక్తి అనుకూలంగా ఉన్నంతవరకు ఓకే. వాళ్లు మేకవన్నె పులులైతే.. నమ్మినవాళ్లను వంచించి లాభం పొందాలనుకునే మనస్తత్వం ఉన్నవారైతేనే వస్తుంది చిక్కంతా. అందుకే ఫేస్‌బుక్ చాటింగ్‌లో.. ఇన్‌స్టా ఇన్‌బాక్స్‌లో సందేశాలు తర్జుమా అవుతున్నప్పుడే మన ఆనుపానులు కనిపెట్టేసి పని పట్టే చోరాగ్రేసరులుంటారని గ్రహించాలి. ఫోన్‌లో మాటలు కలుపుతూ.. ఇంటి విషయాలన్నీ చెబుతున్నప్పుడే మన అమాయకత్వం, మంచితనం, జాలిని క్యాష్ చేసుకొని నిలువునా ముంచేసే మోసగాళ్లు ఉంటారని తెలుసుకోవాలి. బయట కలుసుకోవడం, డేటింగ్‌కి వెళ్లడం.. అనుబంధాలు పంచుకునే వరకూ వెళ్లారంటే జీవితం డేంజర్ జోన్‌లోకి వెళ్తుందని అర్థం చేసుకోవాలి. పరిచయమైన వాళ్లంతా మోసగాళ్లే కాకపోవచ్చు. కానీ ఆ పరిస్థితి రావొచ్చని గ్రహించి మన జాగ్రత్తలో మనం ఉంటేనే జిందగీకి సేఫ్.
ఇవి పంచుకోవద్దు
* ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ప్రేమికులు తమ సామాజిక మాధ్యమాల పాస్‌వర్డ్‌లు సైతం పంచుకుంటారు. ఇది ప్రమాదకరం. వారి సంబంధం బెడిసికొట్టినప్పుడు అసూయతో, కోపంతో బ్లాక్‌మెయిల్‌కి పాల్పడే అవకాశం ఉంది.
* గతంలోని ప్రేమలు, రిలేషన్‌షిప్‌ల గురించి ఆన్‌లైన్ స్నేహితులు, అపరిచితులతో అసలు పంచుకోవద్దు. చులకనగా చూస్తారు. పాత విషయాల్ని తిరగదోడి బెదిరిస్తుంటారు.
* మన ఉద్యోగం, సంపాదన.. వివరాలు ఎవరికీ చెప్పొద్దు. వలపు వల విసిరి, మన నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించే వారికి సమాచారం చేరవేసినట్టే.
* ప్రతి ఇంటిలో సమస్యలుంటాయి. ప్రతి జంట మధ్య పొరపొచ్ఛాలొస్తాయి. జాలి, సాంత్వన కోసం ఆ వివరాలన్నీ ఇతరులతో చెప్పుకోవద్దు. ఈ పరిస్థితిని సావకాశంగా మలచుకొని ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించేవాళ్లుంటారు.
* కుటుంబం, ఆస్తి వివాదాలు.. న్యాయపరమైన చిక్కుల గురించి ఇతరులతో చర్చించొద్దు. దీన్ని సావకాశంగా మలచుకొని.. వివాదాల్లోకి తలదూర్చి లబ్ది పొందాలనుకుంటారు. మన ఆస్తులు, ఆభరణాలు.. అప్పులు.. విలువైన వస్తువుల కొనుగోళ్లు చెప్పాల్సిన పని లేదు.
* మనం ఎంత సన్నిహితమో తెలియ చెప్పడానికి కొందరితో ఏదైనా ఊరెళ్లినా, టూర్‌కి వెళ్లినా చెబుతుంటాం. లొకేషన్ షేరింగ్ చేస్తుంటాం. ఇలాంటి వాటితో కిడ్నాప్‌లు, దోపిడీలకూ ఆస్కారం ఉంటుంది.
భరోసా ఇవ్వాలి
ఇంట్లో ఆదరణ దొరకని అమ్మాయిలు, అబ్బాయిలు ఇతరుల వైపు చూస్తారు. ఎవరైనా తీయగా మాట కలిపితే తేలిగ్గా ఆకర్షితులవుతారు. కొంచెం పొగిడినా, చిన్న సాయం చేసినా తమ సొంత వ్యక్తులని నమ్మేస్తారు. వ్యక్తిగత విషయాలన్నీ పంచుకుంటారు. అవతలివైపు మంచివాళ్లు అయితే ఫర్వాలేదు. జిత్తులమారి వ్యక్తిత్వం ఉన్నవాళ్లైతే వీళ్ల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డంగా వాడేసుకోవడం... అందినంతా గుంజడం చేస్తుంటారు. అందుకే సెల్‌ఫోన్‌లో సందేశం పంపే ముందే.. ఒక ఫొటో షేర్ చేయడానికి ముందే లక్షసార్లు ఆలోచించాలి. మన చిత్రం, వ్యక్తిగత సమాచారం ‘సెండ్’ చేశామా.. మన జీవితం వాళ్ల ‘ఇన్‌బాక్స్’లోకి చేరినట్టే. ఇంట్లోవాళ్ల నుంచి ప్రేమ, ఆప్యాయత దొరకనప్పుడే టీనేజీ పిల్లలు ఇతరుల వైపు చూస్తారు. ఆ పరిస్థితి రాకుండా.. పిల్లలకు మేమున్నాం అని తల్లిదండ్రులు భరోసా కల్పించాలి. యువ జంటలు వీలు చేసుకొని ఒకరికొకరు సమయం కేటాయించాలి. కాలేజీ విద్యార్థుల కోసం విద్యాసంస్థలు కౌన్సిలర్లను నియమించాలి.
ప్రొ.బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సిలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM