Chandrababu: రాష్ట్రానికి తెలుగుదేశం అవసరమేంటో ప్రజలకు వివరించాలి: చంద్రబాబు

40ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక లోగోను అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆవిష్కరించారు. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు

Published : 26 Mar 2022 02:06 IST

మంగళగిరి: 40ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక లోగోను అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆవిష్కరించారు. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టి ఆహార భద్రత సృష్టించారని వివరించారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం అని వివరించారు. పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారని, ఆ పథకాలే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. శుభసూచికంగా ఉంటుందని పార్టీకి పసుపు రంగును ఎన్నుకున్నారని వివరించారు. తెదేపా 40 వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెదేపా అని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తెలుగుదేశం అవసరమేంటో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.

మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు ఉండవా?

కిళ్లీ కొట్టులో కూడా ఆన్‌లైన్‌ పేమెంట్లు ఉంటే, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు ఉండవా? అని చంద్రబాబు నిలదీశారు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగాయా అని ప్రశ్నించారు. మద్యంపై సభలో చర్చ పెట్టరా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్‌ కనుసన్నల్లోనే సరఫరా అవుతోందని ఆరోపించారు. ప్రీమియం బ్రాండ్లు ఏపీలో కనిపించకుండా పోయాయన్నారు. మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. మద్యం విషయంలో సీఎం జగన్‌ దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వివరించారని, దీనిపై ప్రజల్లోకి వెళ్తామన్నారు.

డయాఫ్రం వాల్‌ ఏమైందో సీఎం సమాధానం చెప్పాలి..

మిగిలిపోయిన కాఫర్‌ డ్యాం పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయేది కాదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం చేసిన దరిద్రపు పనికే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని మండిపడ్డారు. పోలవరం విషయంలో జగన్ నంగి నంగి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. డయాఫ్రం వాల్‌ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి పోలవరం ద్వారా నీళ్లిస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.15,600 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పడాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని నాడు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంగా చెప్పారని తెలిపారు. డయాఫ్రం వాల్‌ ఏమైందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం, అమరావతి ఏపీకి రెండు కళ్లని.. ఆ రెండు కళ్లను సీఎం జగన్‌ పొడిచేశారని దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని