Top 5 Mollywood Movies: టాప్‌ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

2024లో వరుస హిట్స్‌తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్‌-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి.

Updated : 10 May 2024 10:45 IST

అదరగొట్టిన అబ్రహాం ఓజ్లర్‌

జయరామ్‌, మమ్ముట్టి కీలక పాత్రలో మిధున్‌ మాన్యువల్‌ థామస్‌ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్‌, మిస్టరీ థ్రిల్లర్‌ ‘అబ్రహం ఓజ్లర్‌. ఆస్పత్రిలో జరిగే వరుస హత్యలను పోలీస్‌ ఆఫీసర్‌ అయిన అబ్రహాం ఓజ్లర్‌ (జయరామ్‌) ఎలా ఛేదించాడన్న ఆసక్తికర కథాంశంతో రూపొందింది. మమ్ముట్టి అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


ఆసక్తికరంగా పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌

క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ జానర్‌లో వచ్చిన మరో మలయాళీ చిత్రం ‘అన్వేషిప్పిమ్‌ కండెతుమ్‌’. టొవినో థామస్‌, సిద్ధిఖీ తదితరులు నటించిన ఈ మూవీని డార్విన్‌ కురియకోస్‌ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయిన యువతుల హత్య కేసును విచారించించే క్రమంలో ఎస్సై ఆనంద్‌ నారాయణన్‌ (టొవినో థామస్‌) ఎదురైన పరిస్థితులను దర్శకుడు ఉత్కంఠగా చూపించాడు. రూ.8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కూడా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి


యువ హృదయాలను కొల్లగొట్టిన ప్రేమలు

ఫీల్‌గుడ్‌ మూవీగా మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’. నాస్లన్‌, మమితబైజు, అల్తాఫ్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని గిరీష్‌ ఏడీ రూపొందించారు.  తెలుగులోనూ అదే పేరుతో విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది. గేట్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన సచిన్‌ సంతోష్‌ (నాస్లెన్‌ కె.గఫూర్‌), రీనూ (మమిత బైజు)ను చూసి ప్రేమలో పడతాడు. మరి సచిన్‌ ప్రేమను రీనూ అంగీకరించిందా? లేదా? అన్నది చిత్ర కథ. తెలుగు వెర్షన్‌ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


ఉత్కంఠతో ఊపేసిన ‘భ్రమయుగం’

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో వైవిధ్య చిత్రం ‘భ్రమయుగం’. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తేవన్‌ అనే గాయకుడు అడవిలో దారితప్పి కుడుమోన్‌ పొట్టి (మమ్ముట్టి) ఇంటికి వెళ్తాడు. అతిథిగా అక్కడికి వెళ్లిన అతనికి కొద్ది రోజులకే తాను అక్కడ బందీ అయినట్లు అర్థమవుతుంది. మరి ఆ భవనం నుంచి తేవన్‌ ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ కుడ్‌మోన్‌ పొట్టి కథేంటి? అన్నది దర్శకుడు రాహుల్‌ సదా శివన్‌ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఫుల్‌ రన్‌లో ఈ మూవీ రూ.80 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఇది సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు

అడ్వెంచర్‌, సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. చిదంబరం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సౌబిన్‌ షాహిర్‌, శ్రీనాథ్‌ బసి తదితరులు నటించారు. విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల్లో ఒకరికి ప్రమాదం జరిగి ఇరుకైన గుహలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారన్న ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.240 కోట్లు వసూలుచేసింది. ప్రస్తుతం డిస్నీ+హాట్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు