Botsa: ఏ క్షణమైనా వెళ్లడమే

‘విశాఖలో రాజధాని ఏర్పాటు ఈ ఏడాదిలో అని కాదు, ఏ క్షణమైనా ఉంటుంది. డెడ్‌లైన్‌ లేదు, దాని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శా

Updated : 04 Jun 2021 09:48 IST

విశాఖలో కార్యనిర్వాహక రాజధానిపై మంత్రి బొత్స
చట్టానికి లోబడి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ‘విశాఖలో రాజధాని ఏర్పాటు ఈ ఏడాదిలో అని కాదు, ఏ క్షణమైనా ఉంటుంది. డెడ్‌లైన్‌ లేదు, దాని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాసనసభలో చట్టం చేసిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైనట్లు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈ ఏడాదిలో విశాఖకు రాజధాని వెళ్లే అవకాశం ఉంటుందా అని విలేకరులు అడగ్గా.. మంత్రి బొత్స సమాధానమిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చేయాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ అభిమతం. అందుకే మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనసభలో చట్టం చేశాం. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందకూడదని కొన్ని దుష్టశక్తులు కోర్టుకు వెళ్లి, మూడు రాజధానుల ప్రక్రియ అమలులో ఆలస్యానికి కారణమయ్యాయి. రాజ్యాంగం, చట్టానికి లోబడి, న్యాయస్థానాల ఆదేశాలనూ పరిగణనలోకి తీసుకుని ప్రక్రియను కొనసాగిస్తాం. అది ఇప్పుడూ శరవేగంగా జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పనిచేయొచ్చు. న్యాయస్థానాల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకునే మా పరిపాలన, విధానాలుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలో చేసిన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటుచేసి తీరతాం. రాజధాని వెళ్లకూడదనేది తెదేపా కోరిక. రాష్ట్రం సర్వనాశనం కావాలనేది వారి పైశాచిక ఆనందం. మాలో చిత్తశుద్ధి, ముఖ్యమంత్రిలో పట్టుదల ఉంది, దీర్ఘకాలిక ఆలోచన ఉంది, దాని ప్రకారమే మా కార్యక్రమాలుంటాయి. రాజ్యాంగపరిధిలోనే ఇవన్నీ జరుగుతాయి’ అని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని, రెండేళ్లలో 28 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని