ఐదేళ్లలో 10మందికే!

నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్‌. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు.

Published : 27 Apr 2024 04:14 IST

పేద బ్రాహ్మణ విద్యార్థులకు జగన్‌ మోసం
‘విదేశీ విద్యా దీవెన’లో మొండిచేయి
రాతలు మారుస్తా అని.. ‘కోతలు’ కోశారు!
అగమ్యగోచరంగా 96 మంది విద్యార్థుల భవిత

నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్‌.
ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు.
అంతలోనే ‘విద్యా దీవెన’కు కోతలు కోసి వారి రెక్కలు విరిచారు!!
అంతూపొంతులేని షరతులు పెట్టి పేద విద్యార్థుల కలల సౌధాలను కుప్పకూల్చారు ఈ మాటల జాదూ జగన్‌!


‘‘ప్రతిభావంతులైన పేద పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోకూడదా? ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తే పేద పిల్లలకు ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారి ఉన్నత విద్యకు పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలుచేస్తున్నాం. ప్రతిభావంతులైన పేద పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడేలా అడుగులు వేస్తున్నాం’’


‘మామ’ ఇచ్చిన మాటపై ఆశతో ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడి వర్సిటీల్లో చేరారు. ఇప్పుడేమో నిబంధనలను సాకుగా చూపి ఫీజు చెల్లించకుండా వారి నోట్లో మట్టి కొట్టారు.


విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి ఉన్న పేద బ్రాహ్మణ విద్యార్థులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (బ్రాహ్మణ కార్పొరేషన్‌) ద్వారా 2014- 2019 మధ్యకాలంలో 236 మందికి రూ.22.50 కోట్ల ఫీజును చెల్లించింది. జగన్‌ సర్కారు మాత్రం ప్రతిభ కల పేద బ్రాహ్మణ విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంది. నిబంధనలు, షరతులను సాకుగా చూపి వారి ఉన్నత విద్యను అడ్డుకుంది. తన ఐదేళ్ల పాలనాకాలంలో కేవలం పది మంది బ్రాహ్మణ విద్యార్థులకు మాత్రమే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద ఫీజులు చెల్లించింది. ఇది చాలు.. పేద బ్రాహ్మణ విద్యార్థులపై జగన్‌ ఎంత కక్షగట్టారో చెప్పడానికి..!

96 మంది నోట్లో మట్టి

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది నుంచే సీఎం జగన్‌ బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశారు. 2019-20 బడ్జెట్‌లో విదేశీ విద్య పథకానికి నిధులు కేటాయించడంతో.. ఆ ఏడాది విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తారని బ్రాహ్మణ కార్పొరేషన్‌ అధికారులు భావించారు. దీంతో ఆ ఆర్థిక సంవత్సరంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన 96 మంది బ్రాహ్మణ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 94 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.9.50 కోట్ల ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విషయమై సంబంధిత విద్యార్థులకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో వారంతా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరారు. నేడో, రేపో డబ్బు మంజూరవుతుందని ఆశగా ఎదురుచూశారు. అంతలోనే పిడుగులాంటి వార్త వారిని ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో అవకతవకలు జరిగాయంటూ జగన్‌ ఈ పథకాన్ని ఆకస్మికంగా నిలిపేశారు. విద్యార్థులకు ఈ విషయం అశనిపాతంలా పరిణమించింది. ఈ డబ్బులు అందక 96 మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

అర్హులను తగ్గించేందుకు ఎత్తుగడలు

గత తెదేపా ప్రభుత్వం బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా చెల్లించిన ఫీజును వైకాపా సర్కారు.. ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈబీసీ) కార్పొరేషన్‌ ద్వారా అందే ఏర్పాటు చేసింది. అయితే ‘జగనన్న విద్యా దీవెన’లో అర్హుల సంఖ్యను తగ్గించేందుకు తీసుకొచ్చిన నిబంధనలు, విధించిన షరతులు బ్రాహ్మణ విద్యార్థులకు శాపంలా పరిణమించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు విదేశాల్లోని 400 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఎక్కువగా చదువుతూ మంచి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. అయితే, క్యూఎస్‌ ర్యాంకింగులో ఉన్న టాప్‌-200 విశ్వవిద్యాలయాల్లో సీటు పొందిన వారికే ఆర్థికసాయం అందిస్తామని ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో 100లోపు ర్యాంకు ఉన్న వర్సిటీల్లో సీటు లభిస్తే 100 శాతం ఫీజు భరిస్తామని, 101 నుంచి 200 వరకు ర్యాంకు ఉన్న వర్సిటీల్లో సీటు పొందితే సగం ఫీజుగానీ, రూ.50 లక్షలుగానీ (రెండింటిలో ఏదీ తక్కువైతే అది) చెల్లిస్తామని తెలిపింది. తర్వాత నిబంధనలను కఠినతరం చేసి పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందని ద్రాక్షగా మార్చేసింది. సబ్జెక్టుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. టాప్‌-50 ర్యాంకు కల వర్సిటీల్లో సీటు సాధిస్తేనే సాయం చేస్తామని షరతు విధించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. బ్రాహ్మణ విద్యార్థుల్లో కేవలం 10 మంది మాత్రమే అర్హత సాధించారు. ఫీజు చెల్లిస్తామని వైకాపా ప్రభుత్వం చెబితేనే తాము విదేశాల్లోని ప్రముఖ వర్సిటీల్లో చేరామని, అకస్మాత్తుగా చేతులెత్తేస్తే తమ చదువులు, భవిష్యత్తు ఏం కావాలి అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారుపై భరోసాతోనే తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు రూ.లక్షలను అప్పుగా తీసుకొచ్చామని, ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చితే అంత డబ్బును తాము ఎక్కడి నుంచి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.



ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని