Midday Meals: 50వేల మందికి 2 గంటల్లో భోజనం

గుంటూరు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (జగనన్నగోరుముద్ద) సరఫరా చేయడానికి మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మించిన

Updated : 19 Feb 2022 05:33 IST

జగనన్న గోరుముద్దకు కేంద్రీకృత వంటశాల ప్రారంభం

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (జగనన్నగోరుముద్ద) సరఫరా చేయడానికి మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మించిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. రెండు గంటల్లోనే 50వేల మంది విద్యార్థులకు ఆహారం తయారుచేసే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.

ఉదయం 10.45కు కేంద్రీకృత వంటశాల ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రీకృత వంటశాల శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించి, స్విచ్‌ నొక్కి వంటశాలను ప్రారంభించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారిని దీవించారు. విద్యార్థులకు అందించే వంటకాలలో చిక్కీని రుచి చూశారు. ఆహారాన్ని విద్యార్థినులకు స్వయంగా వడ్డించి వారిని పలకరించారు. అనంతరం పాఠశాలలకు ఆహారాన్ని రవాణా చేసే వాహనాలను నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు బృందావన చంద్రోదయ మందిర్‌ ఛైర్మన్‌ మధు పండిట్‌దాస్‌, హరేకృష్ణ ఉద్యమం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పలు అంశాలపై వినతులు అందించారు.

గోకుల క్షేత్రానికి భూమిపూజ

తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్‌ శుక్రవారం భూమిపూజ చేశారు. ఆరున్నర ఎకరాల్లో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాలతో పాటు కళాక్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం, యోగా, ధ్యానకేంద్రాలను రూ.70 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు. ఉదయం 11.10 గంటలకు శంకుస్థాపన ప్రాంగణానికి సీఎం చేరుకోగానే ఇస్కాన్‌ ప్రతినిధులు జగన్‌ నుదుటిపై నామం దిద్ది, శాలువా కప్పి స్వాగతం పలికారు. భూవరాహస్వామి యజ్ఞంలో పూర్ణాహుతి చేసిన సీఎం.. గోకుల క్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాలకృష్ణుడు, రాధాకృష్ణులకు పూజలు చేసి హారతి తీసుకున్నారు. అనంతరం భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇస్కాన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సత్కరించి జ్ఞాపిక, భగవద్గీత, భాగవతం గ్రంథాలను బహూకరించారు. కార్యక్రమంలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాం, జంగా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడదల రజని, అన్నాబత్తుని శివకుమార్‌, ముస్తఫా, మద్దాళి గిరి, కాసు మహేష్‌రెడ్డి, కిలారి రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని