బెంగళూరు హ్యాట్రిక్‌

ఎక్కడైతే ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్‌ టైటాన్స్‌ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది.

Updated : 05 May 2024 06:50 IST

టైటాన్స్‌పై ఘనవిజయం
చెలరేగిన డుప్లెసిస్‌, కోహ్లి

ఎక్కడైతే ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్‌ టైటాన్స్‌ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. అదే పిచ్‌పై పూనకం వచ్చినట్లు డుప్లెసిస్‌ రెచ్చిపోవడంతో 5.4 ఓవర్లకే 92/0కు చేరుకున్న ఆర్సీబీ అలవోకగా గెలిచేస్తుందనుకుంటే.. ఊహించని పతనం! 25 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ గెలుపు మీదే సందేహాలు తలెత్తిన పరిస్థితి. కానీ ఉత్కంఠను అధిగమించిన బెంగళూరు హ్యాట్రిక్‌ విజయంతో సాంకేతికంగా మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 11 మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో పట్టికలో పది నుంచి ఏడో స్థానానికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కిది ఏడో ఓటమి.

బెంగళూరు

పీఎల్‌- 17లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గుజరాత్‌ టైటాన్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట గుజరాత్‌ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్‌ ఖాన్‌ (37) టాప్‌స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ (2/29), యశ్‌ దయాళ్‌ (2/21), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (2/23) సత్తాచాటారు. ఛేదనలో డుప్లెసిస్‌ (64; 23 బంతుల్లో 10×4, 3×6), కోహ్లి (42; 27 బంతుల్లో 2×4, 4×6) అదరగొట్టడంతో బెంగళూరు 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టైటాన్స్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ (4/45), నూర్‌ అహ్మద్‌ (2/23) మెరిశారు.

బాదుడే బాదుడు: ఆర్సీబీ ఏమైనా వేరే పిచ్‌ మీద బ్యాటింగ్‌ చేస్తుందా? అప్పటివరకూ టైటాన్స్‌ బ్యాటర్లు ఆపసోపాలు పడింది అక్కడేనా? అనే సందేహాలు కలిగేలా ఛేదనలో డుప్లెసిస్‌, కోహ్లి చెలరేగిపోయారు. ఒకటే బాదుడు. కొడితే ఫోర్‌ లేదా సిక్సర్‌. బౌండరీల హోరుతో చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేశారు. ముఖ్యంగా డుప్లెసిస్‌ ఊచకోత కోశాడు. తొలి ఓవర్లో రెండు సిక్సర్లతో విధ్వంసాన్ని కోహ్లి మొదలెడితే.. ఆ తర్వాత డుప్లెసిస్‌ రెచ్చిపోయాడు. లిటిల్‌కు చుక్కలు చూపించాడు. క్రీజులో నాట్యం చేస్తూ బంతిని బౌండరీ దాటించాడు. మోహిత్‌ శర్మ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఓవర్లో డుప్లెసిస్‌ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్‌ అరంగేట్ర స్పిన్నర్‌ మానవ్‌నూ వరుసగా రెండు సిక్సర్లతో కోహ్లి శిక్షించాడు. మరోవైపు 18 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న డుప్లెసిస్‌ ఔటైపోయినా 6 ఓవర్లకు 92/1తో ఆర్సీబీ విజయం ముందే ఖాయమైంది. మరో అయిదారు ఓవర్లలో మ్యాచ్‌ ముగుస్తుందేమో అనుకుంటే ఆర్సీబీ అనూహ్యంగా తడబడింది. పేసర్‌ లిటిల్‌, స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ ధాటికి 25 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. 92/0తో ఉన్న జట్టు ఒక్కసారిగా 117/6తో కష్టాల్లో పడింది. వేగంగా ఆడాలనే తొందరలో విల్‌ జాక్స్‌ (1), రజత్‌ (2), మ్యాక్స్‌వెల్‌ (4), గ్రీన్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. కాస్త నెమ్మదించిన కోహ్లి చివరి వరకూ ఉండి జట్టును గెలిపిస్తాడనుకుంటే నూర్‌ స్పిన్‌కు చిక్కాడు. అప్పటికీ ఆర్సీబీ విజయానికి 56 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఓవర్లు చాలా ఉన్నాయి. బ్యాటర్లు నిలబడితే చాలు. మరో వికెట్‌ పడితే అంతే సంగతనే దశలో దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌) మరోసారి మెరిశాడు. రషీద్‌ ఖాన్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి విజయాన్ని వేగవంతం చేశాడు. స్వప్నిల్‌ (15 నాటౌట్‌) సిక్సర్‌తో లాంఛనం పూర్తిచేశాడు.

బౌలర్లు భళా: దూసుకొచ్చే షార్ట్‌పిచ్‌ బంతులు.. మంచి లెంగ్త్‌లో పడ్డ బంతులను ఆడలేక బ్యాటర్ల తిప్పలు.. టపటపా పడ్డ వికెట్లు.. ఇదీ పవర్‌ప్లేలో గుజరాత్‌ పరిస్థితి. ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనే విమర్శలకు సిరాజ్‌ బౌలింగ్‌తోనే సమాధానమిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టుకు తన ఎంపిక సరైందేనని చాటాడు. వరుస ఓవర్లలో సాహా (1), శుభ్‌మన్‌ (2)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. సుదర్శన్‌ (6)ను గ్రీన్‌ ఔట్‌ చేయడంతో టైటాన్స్‌ 23/3తో పవర్‌ప్లేను ముగించింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు. ఆర్సీబీ క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం టైటాన్స్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ (1/42) బౌలింగ్‌కు రావడంతో పదో ఓవర్లో మిల్లర్‌ (30) జట్టుకు తొలి సిక్సర్‌ అందించాడు. గ్రీన్‌ (1/28) బౌలింగ్‌లో మిల్లర్‌ క్యాచ్‌ను చేజార్చిన కర్ణ్‌.. వెంటనే తన బౌలింగ్‌లో అతణ్ని వెనక్కిపంపాడు. మరో ఎండ్‌లో పట్టుదలతో నిలబడ్డ షారుక్‌.. కోహ్లి మెరుపు ఫీల్డింగ్‌కు నిష్క్రమించక తప్పలేదు. వైశాఖ్‌ బౌలింగ్‌లో తెవాతియా (35) అక్కడే ఆడగా షారుక్‌ పరుగు కోసం ప్రయత్నించాడు. అతణ్ని తెవాతియా వెనక్కి పంపినా.. ఆ లోపే పాయింట్‌ నుంచి వాయువేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన కోహ్లి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నేరుగా త్రోతో స్టంప్స్‌ను లేపేశాడు. 16వ ఓవర్లో తెవాతియా వరుసగా 4, 6, 4, 4 బాది ఇన్నింగ్స్‌కు వేగాన్ని అందించాలని చూశాడు. కానీ ఆర్సీబీ బౌలర్లు ఆ అవకాశమే ఇవ్వలేదు. 13 బంతుల్లోనే మిగతా 5 వికెట్లు పడగొట్టి టైటాన్స్‌ను ఆలౌట్‌ చేశారు. తెవాతియా క్యాచ్‌ను వైశాఖ్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఆఖరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడటంతో టైటాన్స్‌ 150 స్కోరును అందుకోలేకపోయింది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) దినేశ్‌ (బి) సిరాజ్‌ 1; శుభ్‌మన్‌ (సి) వైశాఖ్‌ (బి) సిరాజ్‌ 2; సుదర్శన్‌ (సి) కోహ్లి (బి) గ్రీన్‌ 6; షారుక్‌ రనౌట్‌ 37; మిల్లర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కర్ణ్‌ 30; తెవాతియా (సి) వైశాఖ్‌ (బి) యశ్‌ 35; రషీద్‌ (బి) యశ్‌ 18; విజయ్‌ శంకర్‌ (సి) సిరాజ్‌ (బి) వైశాఖ్‌ 10; మానవ్‌ (సి) స్వప్నిల్‌ (బి) వైశాఖ్‌ 1; మోహిత్‌ రనౌట్‌ 0; నూర్‌ అహ్మద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 147; వికెట్ల పతనం: 1-1, 2-10, 3-19, 4-80, 5-87, 6-131, 7-136, 8-147, 9-147; బౌలింగ్‌: స్వప్నిల్‌ 1-0-1-0; సిరాజ్‌ 4-0-29-2; యశ్‌ దయాల్‌ 4-0-21-2; గ్రీన్‌ 4-0-28-1; వైశాఖ్‌ 3.3-0-23-2; కర్ణ్‌శర్మ 3-0-42-1

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) సాహా (బి) నూర్‌ 42; డుప్లెసిస్‌ (సి) షారుక్‌ (బి) లిటిల్‌ 64; జాక్స్‌ (సి) షారుక్‌ (బి) నూర్‌ 1; రజత్‌ (సి) మిల్లర్‌ (బి) లిటిల్‌ 2; మ్యాక్స్‌వెల్‌ (సి) మిల్లర్‌ (బి) లిటిల్‌ 4; గ్రీన్‌ (సి) షారుక్‌ (బి) లిటిల్‌ 1; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 21; స్వప్నిల్‌ సింగ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152; వికెట్ల పతనం: 1-92, 2-99, 3-103, 4-107, 5-111, 6-117; బౌలింగ్‌: మోహిత్‌ 2-0-32-0; జోష్‌ లిటిల్‌ 4-0-45-4; మానవ్‌ సుతార్‌ 2-0-26-0; నూర్‌ అహ్మద్‌ 4-0-23-2; రషీద్‌ ఖాన్‌ 1.4-0-25-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు