AP Govt: పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో మార్పు

పదోతరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తిగా మార్చేసింది. 2024లో ఇదే విధానంలో ప్రశ్నపత్రాన్ని ఇవ్వనుంది.

Updated : 28 Jul 2023 07:46 IST

వెబ్‌సైట్‌లో నమూనాలు

ఈనాడు, అమరావతి: పదోతరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తిగా మార్చేసింది. 2024లో ఇదే విధానంలో ప్రశ్నపత్రాన్ని ఇవ్వనుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎక్కువ మంది తెలుగు, హిందీలో అనుత్తీర్ణులవుతున్న నేపథ్యంలో  ప్రశ్నల విధానాన్ని మార్చింది. సామాన్య శాస్త్రానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

గతేడాది ఒకటే ప్రశ్నపత్రంలో పార్ట్‌-ఏలో భౌతిక, రసాయన శాస్త్రం, పార్ట్‌-బీలో జీవశాస్త్రం నుంచి ప్రశ్నలు ఇచ్చారు. సమాధానాలు రాసేందుకు మాత్రం విడివిడిగా బుక్‌లెట్‌లు ఇచ్చారు. కొందరు విద్యార్థులు జవాబులను కలిపి రాయడంతో మూల్యాంకనం సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రాలు, సమాధానాలు రాసే బుక్‌లెట్‌లను విడివిడిగా ఇవ్వాలని పరీక్షల విభాగం నిర్ణయించింది. మొదట భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నపత్రం.. దీనికి సమాధానాలు రాసిన తర్వాత జీవశాస్త్రం ప్రశ్నపత్రం ఇస్తారు.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆంగ్లం, గణితం, సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. నమూనా ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. హిందీలో 14 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 19 ఇవ్వనున్నారు. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. 8మార్కులకు పద్యం ఇచ్చి, దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఇవ్వనున్నారు.

ప్రతిపదార్థం తొలగింపు..

  • తెలుగుకు సంబంధించి గతంలో 8మార్కులకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న స్థానంలో.. ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు.
  • రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సిన ప్రశ్నను తీసుకొచ్చారు. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు. నాలుగో ప్రశ్నగా పత్రికల్లో వచ్చిన ఓ వార్తను ఇచ్చి దానిపై ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడా ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు.
  • రెండో విభాగంలో వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి 36మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. విభాగం-3లో పదజాలం, వ్యాకరణంపై 32మార్కులకు ప్రశ్నలు ఉన్నాయి.
  • అవగాహన-ప్రతిస్పందనకు 32మార్కులు, వ్యక్తీకరణ-సృజనాత్మకతకు 36, భాషాంశాలకు 32 మార్కులు మొత్తం వంద మార్కులకు ప్రశ్నపత్రాన్ని రూపొందించారు.
  • వ్యాసరూప ప్రశ్నలు 56మార్కులు, లఘుప్రశ్నలు 12, అతిలఘు ప్రశ్నలు 18, లక్ష్యాత్మక ప్రశ్నలు 14 మార్కులకు ఇస్తారు.

ఇది సబబుకాదు

పద్యానికి ప్రతిపదార్థం, తాత్పర్యం తొలగింపు సరైన విధానం కాదు. ఇలాగైతే విద్యార్థులు పద్యాలను కంఠస్తం చేయడం మానేస్తారు. పద్యాలను కంఠస్తం చేయకపోతే మాతృభాష మాధుర్యాన్ని ఎలా పొందగలుగుతారు? తెలుగు భాష సొత్తు తెలుగు పద్యం. ప్రశ్నపత్రం మార్చడంలో తప్పులేదు గానీ కనీస విలువలు, భాషా సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది.

విశ్రాంత తెలుగుపండితుడు జోస్యుల లక్ష్మీకాంత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని