Pattiseema: పట్టిసీమ నాపై పగబట్టిందే..!

హతవిధీ.. ఈ వరుణుడు ఇప్పుడే పగబట్టాలా..! ఈ ఏడాది వానలు ఇంతలా ముఖం చాటేయాలా..! నా శత్రువు ప్రారంభించిన ప్రతి పథకాన్నీ నామరూపాల్లేకుండా చేశానే..!

Updated : 13 Aug 2023 08:03 IST

ఇన్నాళ్లూ పక్కనపెట్టినా ఇప్పుడు అదే దిక్కయ్యిందే!
ప్రభుత్వ పెద్ద అంతరంగ మథనం
ఈనాడు - అమరావతి

హతవిధీ.. ఈ వరుణుడు ఇప్పుడే పగబట్టాలా..!

ఈ ఏడాది వానలు ఇంతలా ముఖం చాటేయాలా..!

నా శత్రువు ప్రారంభించిన ప్రతి పథకాన్నీ నామరూపాల్లేకుండా చేశానే..!

చేపట్టిన ప్రతి ప్రాజెక్టునూ తుంగలో తొక్కేశానే..!

అమరావతిని సర్వనాశనం చేశానే..!

పోలవరం ప్రాజెక్టును కుళ్లబొడిచి ఇప్పట్లో కోలుకోకుండా చేశానే..!

అయినా ఈ పట్టిసీమ మాత్రం నన్ను ఎందుకు వదలడం లేదు?

విధి విలాసమా? ప్రకృతి నాతో ఆడుతున్న పరాచికమా..!

అయినా నేను చేసిన తప్పేంటి..!

ప్రజాప్రయోజనాల కంటే.. నా అహం చల్లారడమే ముఖ్యమనుకున్నాను..!

కోట్ల ప్రజాధనం వృథా అయినా పర్లేదు.. గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ మిగలకూడదనుకున్నాను..!

అందుకే అన్న క్యాంటీన్లను నామరూపాల్లేకుండా చేశాను..!

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్ని రద్దు చేశాను.. కుదరకపోతే పేరు మార్చేశాను..!

అన్ని పథకాలకు, ప్రాజెక్టులకు అయితే నా పేరు.. లేకపోతే మా నాన్న పేరు పెట్టేశాను..!

విదేశీ విద్య, పెళ్లికానుకల్ని మూడేళ్లు ఆపేశాను.. ఆనక పేరు మార్చేశాను..!

టిడ్కో ఇళ్లకు మా రంగులు వేసేశాను..! 

ఎక్కడ చూసినా నా నామస్మరణే వినపడాలని ఆశపడ్డాను..!

అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు నన్ను అతిశయోక్తులతో పొగుడుతుంటే ఆనందపడ్డాను..!

పేదల గుండె చప్పుడు లబ్‌డబ్‌ అని కాకుండా... నా పేరే ధ్వనిస్తోందని మా ఎమ్మెల్యే చెబితే మురిసిపోయాను..!

నాలుగేళ్లకే ఆ ఎమ్మెల్యే నా మాటను ధిక్కరించి వెళ్లిపోయినా పోనీలే అనుకున్నాను..!

పట్టిసీమకూ మిగతా ప్రాజెక్టుల దుర్గతే పట్టిద్దామనుకున్నాను...!

అసలు పట్టిసీమ మోటర్లను ఆన్‌ చేసే రోజు ఎప్పటికీ రాకూడదనుకున్నాను..!

అందుకే గోదావరిలోని నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా ఇన్నాళ్లూ చోద్యం చూశాను..!

పులిచింతల నీళ్లతో వీలైనంత కాలం నెట్టుకొద్దామనుకున్నాను..!

అప్పటికి వానదేవుడు కరుణించకపోతాడా.. మేఘాలు గర్జించకపోతాయా అని ఆశపడ్డాను..!

కానీ విధి ఇలా వింత నాటకమాడుతుందని ఊహించలేదు..!

సాగర్‌లో సరిపడా నీళ్లు లేవు.. పులిచింతల నీళ్లు ఇప్పటికే కొంత వాడేశాం.. చిరు చినుకులు మురిపిస్తున్నాయే తప్ప.. కుండపోత వానల్లేవు..!

ఇప్పట్లో భారీ వర్షాలు కురిసి.. కృష్ణకు వరద పోటెత్తే సూచనల్లేవు.

వద్దు వద్దనుకున్నా పట్టిసీమ వైపే చూడాల్సి వస్తోంది..

ఇప్పటికీ మొండికేస్తే.. అందరి ముందు పెద్ద దోషిలా నిలబడాల్సి వస్తుంది..!

అందుకే పట్టిసీమను వాడటం అనివార్యమని మా అమాత్యునితోనే  చెప్పించాల్సి వచ్చింది..!

ఎన్ని రంగులు మార్చినా... పట్టిసీమ మాత్రం నన్ను వదలడం లేదు..!

ఇలాంటి కష్టం ‘చంద్రబాబు’కు కూడా రాకూడదు..!

పట్టిసీమ

ప్రస్తుతం ప్రభుత్వ పెద్ద అంతరంగంలో ఇలాంటి ఆవేదనే సుడులు తిరుగుతూ ఉండొచ్చు..! ఇలాంటి మథనమే జరుగుతూ ఉండొచ్చు..! ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు పాలకులు ఎంతో వివేకంతో, వివేచనతో, ముందు చూపుతో వ్యవహరించాలి. కానీ ‘రివర్స్‌ పాలనే’ ప్రభుత్వానికి తారకమంత్రం కదా! అందుకే కేవలం పట్టిసీమను వాడకూడదన్న పట్టుదలతో.. కృష్ణలో నీళ్లు లేకపోయినా, గోదావరిలో వరద జలాలు సముద్రం పాలవుతున్నా ఆ ప్రభుత్వ పెద్ద ఇన్నాళ్లూ చోద్యం చూస్తూ ఊరుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం సిద్ధంగా ఉన్నా, గోదావరి జలాల్ని కృష్ణా నదికి తరలించే అవకాశం ఉన్నా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేశారు. గోదావరి ప్రవాహాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నా, నీటిని ఎత్తిపోసేందుకు పట్టిసీమ ప్రాజెక్టును అధికారులు సంసిద్ధం చేసి ఎదురు చూస్తున్నా సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడిక విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణకు తరలించక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టులో రెండు పంపులను ఇటీవల అధికారులు ఆన్‌ చేసి, ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. శనివారం నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు టీఎంసీలకుపైగా నీటిని వదిలారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా సుమారు 1,400 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయి. ఇంత ఆలస్యం చేయకుండా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లించి ఉంటే చాలా జలాలు ఆదా అయ్యేవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని