ప్రభుత్వోద్యోగులు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు

ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు.

Updated : 20 Mar 2024 07:40 IST

కొత్త పథకాలేవీ ప్రకటించడానికి వీల్లేదు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందటం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటమేనని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వోద్యోగులపై ఐపీసీలోని సెక్షన్‌ 171, 123, 129, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134ఏ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతోపాటు సర్వీసు నియామావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేరొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి, ముకేశ్‌కుమార్‌ మీనాలు మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కొత్త పథకాలు ప్రకటించటానికి వీల్లేదు. బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం. వర్క్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రారంభం కాని పనులేవీ ఇప్పుడు చేపట్టకూడదు. పూర్తయిన పనులకు సంబంధించిన నిధుల విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదు. వివిధ రకాల  పింఛన్ల పంపిణీకి అభ్యంతరం లేదు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు, దృశ్య శ్రవణ సమావేశాలు నిర్వహించకూడదు. నరేగా కింద ఇప్పటికే నమోదైన లబ్ధిదారులకు యథావిధిగా ఉపాధి పనులు కల్పించొచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఏవైనా పనులకు టెండర్లు పిలిచి ఉంటే ఆ ప్రక్రియ కొనసాగించవచ్చు. కానీ వాటిని ఖరారు చేయటానికి వీల్లేదు. ప్రభుత్వ ఆస్తులు, బహిరంగ ప్రదేశాలపై ఉన్న గోడరాతలు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలి. ప్రభుత్వ వెబ్‌సైట్లలో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఆడియో, వీడియోల వంటివి వెంటనే తీసేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాలి. కోడ్‌ ఉల్లంఘన విషయంలో ఏ శాఖపైనైనా ఫిర్యాదులొస్తే సకాలంలో స్పందించిన తగిన చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.

ఈసీ మార్గదర్శకాలకు లోబడే పార్టీల ప్రచారం

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా చేసే ఎలాంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించకూడదని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై చెక్‌పోస్టులు ఉన్నచోట వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పటిష్ఠ నిఘా పెట్టాలని సూచించారు. ఉద్యోగులు, ఓటర్లకు తాయిలాలు పంచకుండా నియంత్రించాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మంగళవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘ప్రైవేటు భవనాల గోడలపై ఉన్న రాతలను సైతం చెరిపేయాలి. ప్రభుత్వ, వాణిజ్య స్థలాల్లో రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించొద్దు. సీ-విజిల్‌ ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలి. ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఓటర్లు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలపై ఒత్తిడి పెంచాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే సిబ్బందికి మరో రెండుసార్లు శిక్షణ ఇవ్వాలి’ అని అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని