సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు.

Updated : 30 Apr 2024 12:33 IST

ఎలాంటి పాత్ర లేకున్నా సర్వశక్తులూ ఒడ్డుతున్న విపక్షం
ఇంటింటికీ పింఛన్లపై అధికార పార్టీ వికృత రాజకీయ క్రీడ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ జగన్‌ గీసిన గీత దాటరు. జగన్‌ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తితిదే ఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించుకోగలరు. తన ప్రతి ఎన్నికల ప్రచారసభకూ వెయ్యికి మించిన ఆర్టీసీ బస్సుల్నీ రప్పించుకోగలరు. ఐదేళ్లుగా అప్రతిహత అధికారాన్ని చలాయిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికీ అదే స్థాయిలో శాసిస్తున్న జగన్‌... ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని మాత్రం సీఎస్‌ను ఆదేశించడం లేదు. ఆ అంశంపై కనీసం నోరు మెదపట్లేదు. ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయలేదు. ఎందుకు? ఇంటింటికీ పింఛన్ల పంపిణీ తన మానసపుత్రికని జగన్‌ గొప్పలు చెబుతారు కదా? అలాంటిది సుమారు 66 లక్షల మంది లబ్ధిదారుల్ని, అందులోనూ సగానికిపైగా ఉన్న వృద్ధుల్ని మండే ఎండల్లో మొదట సచివాలయాలకు, ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని సీఎస్‌ చెబుతుంటే జగన్‌ ఎందుకు నోరు విప్పడం లేదు?

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున జగన్‌ కొత్త విధాన నిర్ణయాలు తీసుకోలేరేమో గానీ, ఉన్న విధానాల్ని కొనసాగించేందుకు, సమీక్షించేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదే..! మరి ఆయనే ప్రవేశపెట్టిన, ఐదేళ్లుగా అమల్లో ఉన్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానాన్ని కొనసాగించాలని సీఎస్‌ను ఎందుకు ఆదేశించడం లేదు? అలా ఆదేశించడం ఆయనకు ఇష్టం లేదా? ఆయన మౌనం వెనుక కారణమేంటి? బ్యాంకుల్లో తగిన సదుపాయాలు ఉండవని ఆయనకు తెలీదా? ఐదేళ్లలో లబ్ధిదారుల కోసం 130 సార్లు బటన్‌ నొక్కానని గొప్పలు చెప్పే జగన్‌... అత్యంత కీలకమైన సమయంలో ‘సీఎస్‌’ అన్న బటన్‌ ఎందుకు నొక్కడం లేదు? అసలు రాష్ట్రంలో పింఛన్ల సమస్య అనేది ఒకటి ఉందన్నట్లు ఎందుకు వ్యవహరించడం లేదు? ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ, అన్ని అంశాలపైనా మాట్లాడుతూ, సిద్ధం.. సిద్ధం అంటూ గొంతు చించుకుంటున్న జగన్‌... పింఛన్లపై మాత్రం మాట్లాడకపోవడంతో ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన మౌనం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరింత లోతుగా తరచి చూస్తే అవే నిజమనిపిస్తున్నాయి! ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా... మండుటెండల్లో వృద్ధుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి... ఎండలవేడి తాళలేక వారు ఇబ్బంది పడితేనో, ఏదైనా ఉపద్రవం జరిగితేనో ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది!

ప్రతిపక్షానికే ఎందుకు పట్టింది?

మరోపక్క ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఆయనకు ఎలాంటి అధికారాలూ లేవు. ఐదేళ్లుగా జగన్‌ సేవలో తరిస్తున్న అధికార యంత్రాంగం కనీసం చంద్రబాబును ప్రతిపక్ష నేతగానూ గుర్తించడం లేదు. సీఎస్‌, డీజీపీ లాంటి అధికారులెవరూ ఆయన మాటకు కనీస విలువా ఇవ్వడంలేదు. తన మాట చెల్లుబాటు కాకపోయినా, తనకు అధికారం లేకపోయినా... ఇప్పుడు అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయించడం కోసం చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. మండుతున్న ఎండల్లో వృద్ధుల్ని సచివాలయాలకు, బ్యాంకులకు కిలోమీటర్ల దూరం తిప్పొద్దని వేడుకుంటున్నారు. విజ్ఞప్తి చేస్తున్నారు. తెదేపా భాగస్వామ్య పక్షాలైన జనసేన, భాజపా నాయకులూ ఆయనతో గొంతు కలిపారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయండని నెత్తీ నోరూ కొట్టుకుని అడుగుతున్నారు. ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టుగా అలుపెరగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించారు.

సీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన నిర్వహించారు. ఉద్ధృతంగా పోరాడుతున్నారు. పింఛన్ల వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీనే ఎందుకంత సీరియస్‌గా తీసుకుంది? వృద్ధుల కష్టం ఆ పార్టీకే ఎందుకు పట్టింది? ఏ అధికారమూ లేకపోయినా... వృద్ధులు, ఇతర లబ్ధిదారులైన 66 లక్షల మంది పేదల తరఫున ఎందుకు పోరాటం చేయాల్సి వస్తోంది? ఏప్రిల్‌ నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని అధికారులు చెప్పినప్పుడూ ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా పోరాడింది. ఇప్పుడూ పోరాడుతోంది. మండుటెండల్లో వృద్ధుల్ని తిప్పడం సరికాదు... పింఛన్లు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వండి మహోప్రభో అని... ఎలుగెత్తి చాటుతోంది. సర్వశక్తులూ ఒడ్డుతోంది. వృద్ధులు, ఇతర లబ్ధిదారుల క్షేమాన్ని కోరే ప్రధాన ప్రతిపక్షం అంతగా పోరాడుతోంది. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చూడాల్సిన అధికారపార్టీ మౌనం వహించడం, ఏ అధికారాలూ, ఏ పాత్రాలేని ప్రతిపక్షం ఆ బాధ్యత తీసుకోవడం... దేశంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎక్కడైనా చూస్తామా? ఇక్కడే అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?

కుట్రలు, కుహకాల్లో ఆరితేరిన జగన్‌

ఎందుకంటే? తిమ్మిని బమ్మిని చేయడంలో, దుష్ప్రచారంలో వైకాపా నాయకుల్ని మించిన అఖండులు మరొకరు లేరు కాబట్టి..! ఎన్నికల ముందు సొంత బాబాయ్‌ హత్యకు గురైతే.... నిందితులుగా ఉన్నవారే నారాసుర రక్తచరిత్ర అంటూ... ప్రతిపక్ష నేతపై అభాండం వేసి, డ్రామాను రక్తికట్టించిన ఘనులు కాబట్టి..! తమ వికృత రాజకీయ క్రీడకు ఇప్పుడు ‘అవ్వాతాతల్ని’ బలిపెడుతున్నారు కాబట్టి..! ఏప్రిల్‌ మొదటి వారంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే ఎండలకు తాళలేక... పింఛన్ల కోసం సచివాలయాలకు తిరిగే క్రమంలో 32 మంది చనిపోయారు. ఇప్పుడు జగన్‌ తన అధికారదాహాన్ని తీర్చుకోవడానికి మరింతమంది అవ్వాతాతల్ని అంపశయ్య ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు..! వచ్చే వారం రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అంత తీవ్రమైన ఎండల్లో వృద్ధులు ఎండల్లో బ్యాంకులకు తిరిగితే ఈసారి మరింతమంది ఇబ్బందిపడే, ఆస్పత్రుల పాలయ్యే అవకాశం ఉంది. జగన్‌కు, అధికారపార్టీ నాయకులకూ కావలసిందీ అదే..! ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్నదే వాళ్ల కుట్ర..! వాలంటీర్ల ద్వారా పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు పంపిణీ చేయించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా... ఏప్రిల్‌ మొదటి వారంలో సచివాలయాలకే వచ్చి పింఛన్లు తీసుకోవాలని లబ్ధిదారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. పండుటాకుల్లాంటి వృద్ధుల్ని అధికార పార్టీ నాయకులు... చక్రాల కుర్చీలపైనా, మంచాలపైనా మండుటెండల్లో ఊరేగించారు. నానా హంగామా సృష్టించారు. దానికంతా విపక్షమే కారణమని నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే డ్రామాను పునరావృతం చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది అధికారపార్టీ కుట్ర. అదే వారి విషపూరిత పన్నాగం. వాళ్లేం చెబితే అది నమ్మేయడానికి ప్రజలంత అమాయకులా? విజ్ఞులైన ప్రజలు... అధికార పార్టీ కుట్రల్ని, వికృత రాజకీయ రాక్షసక్రీడను అర్థం చేసుకోవాలి. కీలెరిగి వాతపెట్టాలి...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని