ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది.

Updated : 06 May 2024 06:33 IST

టైటిలింగ్‌ యాక్ట్‌ ఓ నల్లచట్టం
ఈటీవీ ప్రత్యేక చర్చలో ప్రముఖుల మనోగతం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. ప్రైవేటు స్థలమా? ప్రభుత్వ భూమా? అనే తేడా లేకుండా కన్నుపడితే చాలు కబ్జా చేయడమే వారికి తెలిసింది. దాన్ని మరింత విస్తృతం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చిందంటే జనం ఆస్తులు గోవిందా? అనే భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చట్టంలోని ప్రమాదకర అంశాలేంటి? దాన్ని అమలు చేస్తే జరిగే పర్యవసానాలేంటి? అనే అంశంపై ఈటీవీ ఆంధప్రదేశ్‌ ‘ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ’ పేరిట ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ప్రముఖులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు.


ప్రజలకు కొత్త కష్టాలు తప్పవు

-వీఆర్వోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి

భూయాజమాన్య హక్కు చట్టంపై ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కేవలం నాలుగు వేల గ్రామాల్లో ఇప్పటి వరకు సర్వే జరగింది. 13 వేల గ్రామాల్లో ఇంకా సర్వే కాలేదు. అందులో అనేక తప్పిదాలున్నాయి. చాలా చోట్ల అవకతవకలు చోటుచేసుకున్నాయి. తాడేపల్లి ప్యాలస్‌ నుంచి వచ్చిన ఫోన్‌ ఆదేశాలు, అందిన ముడుపుల ఆధారంగా అన్ని జరిగిపోతున్నాయి. ఈ చట్టం ద్వారా రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఇది అమల్లోకి రాకముందే, జగన్‌ ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాల పేరుతో భూములను రీసర్వే చేపట్టింది. హద్దులు నిర్ణయించి జగన్‌ బొమ్మతో రాళ్లు పాతింది. రికార్డుల డిజిటలైజేషన్‌, శాశ్వత హక్కు పత్రమంటూ వాటిపై జగన్‌ బొమ్మను ముద్రించింది. టైటిలింగ్‌ చట్టంతో ప్రజలకు కొత్త కష్టాలు తప్పవు. ఎన్నికల్లో ప్రజలే తమ చేతిలోని ఓటు అనే పాశుపతాస్త్రం ప్రయోగించి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి.


జగన్‌ బొమ్మ వేసేందుకు కోట్లు ఖర్చు చేశారు  

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

జగనన్న భూ రక్ష పుస్తకం ఒట్టి డొల్ల. అందులో ఆయన బొమ్మేసి, పుస్తకాలు ప్రింట్‌ చేసి ఇదే మీ పాస్‌ పుస్తకం అని ఇస్తున్నారు. ఇది దేనికీ పనికిరాదని వాళ్లే చెబుతున్నారు. బ్యాంకు రుణం తీసుకునే సందర్భంలో, భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సందర్భంలో ఈ భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకం అధికారికి చూపించనవసరం లేదని ఆ పుస్తకంలోనే పేర్కొన్నారు. అంటే.. ఇది బోగస్‌ పుస్తకం. దేనికీ పనికిరాదు అని అర్థమవుతోంది. పుస్తకంపై సీఎం జగన్‌ బొమ్మేసేందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇచ్చిన పాస్‌ పుస్తకం, ఆ తర్వాత తెదేపా ప్రభుత్వంలో పాస్‌ పుస్తకాలు ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన పాస్‌ పుస్తకంలో అన్ని హక్కులు కల్పించారు. అది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. జగన్‌ బొమ్మతో ఉన్న పాస్‌ బుక్‌ ఎక్కడా చెల్లదు. దానితో బ్యాంకు వాళ్లు రుణాలు ఇవ్వరు. హక్కు పత్రం కూడా లభించదు. అనేక లోపాలతో భూ రక్ష పథకాన్ని తీసుకువచ్చి, వేల కోట్లు దుబారా చేశారు. భూ రక్ష పథకమే జగన్‌ను దెబ్బతీయబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని