నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!

2019 ఎన్నికలప్పుడు జగన్‌ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు

Updated : 06 May 2024 06:16 IST

వడ్డీలేని పంట రుణాలిస్తామని 2019 మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ
సీఎం అయ్యాక రూ.లక్షలోపు రుణాలకే వర్తింపు
జగన్‌ లెక్కల ప్రకారమే ఇవ్వాల్సిన మొత్తం రూ.27 వేల కోట్లు
ఐదేళ్లలో ఇచ్చింది రూ.848 కోట్లే
ఎగ్గొట్టింది ఏకంగా రూ.26 వేల కోట్లపైనే
ఈసారి ఎన్నికల్లో మళ్లీ సున్నా వడ్డీ హామీ!
ఈనాడు, అమరావతి

2019 ఎన్నికలప్పుడు జగన్‌ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు. పావలా వడ్డీని సైతం ఎత్తేశారు... అర్హుల ఎంపికలో అలవిమాలిన షరతులు పెట్టారు...  రైతుల కోసం ఎందాకైనా వెళతానన్న మనిషే... వారిని వడ్డీ వ్యాపారుల పాల్జేశారు! పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీనే నెరవేర్చని నేత... మళ్లీ కొత్త దాంట్లోనూ సున్నా వడ్డీని పునఃముద్రించారు! అదే మోసానికి తెరతీశారు.. నిన్న ఇవ్వలేదుగానీ.. రేపిస్తానని నమ్మబలుకుతున్నారు!!

‘‘రైతులకు ఎంత ఇస్తే.. అది సున్నా వడ్డీ అవుతుందో ముందు తెలుసుకోవాలి. కేంద్రం పంట రుణాల్ని 7% వడ్డీపై ఇస్తుంది. ఏడాదిలోగా చెల్లిస్తే 3% రాయితీ అమలు చేస్తుంది. అంటే రైతు 4% చెల్లించాలి. 2018-19లో తెదేపా హయాంలో రూ.76,721 కోట్ల పంట రుణాలిచ్చారు. దానిపై 4% వడ్డీ రాయితీ లెక్కిస్తే... ఏడాదికి రూ.3,068 కోట్లు అవుతుంది. అంటే ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు. ఇంత డబ్బు ఇస్తే తప్ప సున్నా వడ్డీ రైతులకు అందుబాటులోకి రాదు. తెదేపా వారు దాన్ని ఎగ్గొట్టి రుణమాఫీ అన్నారు’’ అంటూ 2019 జులై 11న అసెంబ్లీలో జగన్‌ రైతు శ్రేయోభిలాషిలా ప్రసంగించారు. సున్నా వడ్డీ కింద చెల్లించేందుకు తాము ఆ ఏడాది బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

మరి ఏం జరిగిందంటే...

జగన్‌ అధికారంలోకి వచ్చింది మొదలు.. 2019-20 నుంచి 2023-24 వరకు రైతులకు ఇచ్చిన మొత్తం పంట  రుణాలపై 4% వడ్డీ లెక్కిస్తే ఐదేళ్లకు రూ.27,087 కోట్లు అవుతుంది. అందులో ఇచ్చింది రూ.848 కోట్లు మాత్రమే. ఇందులో మొదటి ఏడాది విడుదల చేసిందే రూ.382 కోట్లు. మిగిలిన నాలుగేళ్లలో రూ.466 కోట్లు మాత్రమే విదిల్చారు. అంటే జగన్‌ ఇచ్చిన హామీ మొత్తంగా అమలైంది 3.13 శాతమే. ఇలా సున్నా వడ్డీ రూపంలో ఐదేళ్లలో ఎగ్గొట్టింది రూ.26,239 కోట్లు. అందులో రైతు భరోసా పేరిట పంచింది  రూ.19,170 కోట్లు. పైగా కొన్ని రాయితీ పథకాలు  ఎత్తేశారు. అయినా ఇంకా సర్కారుకు రూ.7వేల కోట్ల మిగులే. ఇదీ రైతుబిడ్డ పాలన అంటే!!


జగనన్న మోసంలో ఇది పరాకాష్ఠ

నవరత్నాల్లో హామీ

రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలిస్తాం.

మరి చేసిందేంటి

రూ.లక్ష లోపు పంట రుణాలకే అనే నిబంధన పెట్టారు. వాటినీ ఏడాదిలోగా వడ్డీతో సహా రైతులే చెల్లించాలని షరతు విధించారు. అలా చెల్లించిన రైతుల పేర్లను బ్యాంకులు పంపిస్తే.. ఏడాది తర్వాత జమ చేస్తామన్నారు. అదీ ఈ-క్రాప్‌లో నమోదై ఉంటేనే.  ఈ-క్రాప్‌లో నమోదైన పంటలకు..  నిర్ణయించిన రుణపరిమితి ప్రకారమే ఇస్తామన్నారు.

ఇది మోసం కాదా...?

ఎన్నికల హామీలో ఎక్కడా రూ.లక్ష వరకు పంట రుణాలకే సున్నా వడ్డీ ఇస్తామని చెప్పలేదు. వడ్డీతో సహా ముందు చెల్లిస్తేనే అమలు చేస్తామని పేర్కొనలేదు.  ఈ-క్రాప్‌, పంటరుణ పరిమితి అనే షరతులు నవరత్నాల్లో పెట్టలేదు. మరి గెలిచాక ఇన్ని రకాల నిబంధనలు పెట్టడమంటే... అన్నదాతలను మోసం చేయడం కాదా?

అసెంబ్లీలో చెప్పిందీ పాటించరా..?

2019 జులై 11న   అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో రాష్ట్రంలో రైతులు తీసుకునే మొత్తం పంట రుణాలకు సున్నా వడ్డీ వర్తిస్తుందనేలా మాట్లాడారు. ఆ తర్వాత రూ.లక్ష లోపు పంట రుణాలకే సున్నా వడ్డీ వర్తిస్తుందనే నిబంధన తెచ్చారు. ఇలా మాట మార్చేవారిని  ఏమనాలి?


సవాలక్ష కొర్రీలతో కోతలు  

పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతుల ఖాతాలను బ్యాంకులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఏడాది తర్వాత ప్రభుత్వం రైతుల ఖాతాలకు వారు చెల్లించిన వడ్డీని జమ చేస్తోంది. ఇందులోనూ కొర్రీలపై కొర్రీలు పెట్టారు.

  • రైతులు ఈ-క్రాప్‌లో నమోదు కాకుంటే.. రూ.లక్ష లోపు రుణం తీసుకున్నా వారికి సున్నా వడ్డీ ఇవ్వడం లేదు.
  • బ్యాంకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రకారం.. 2021-22 రబీ, 2022 ఖరీఫ్‌ల పంట రుణాలకు సంబంధించి 13.42 లక్షల మంది రైతులకు రూ.298 కోట్లను సున్నా వడ్డీ కింద జమ చేయాలి. అయితే 10.78 లక్షల మంది రైతులకు రూ.216 కోట్లు మాత్రమే జమ చేశారు. అంటే కొర్రీలు పెట్టి రూ.82 కోట్లు ఎత్తేశారు. రైతుల కోసం ఎందాకైనా పోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందంటూ ఉపన్యాసాలు చెప్పే జగన్‌... అదే రైతులను వడ్డీ   వ్యాపారుల ఇళ్లకు పంపిస్తున్నారు.

గతంలో సున్నా వడ్డీ పథకమే లేదంట?  

వైకాపా అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం వచ్చిందనేలా జగన్‌ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ‘రైతుల కోసం వై.ఎస్‌.ఆర్‌. సున్నా వడ్డీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో ఈ పథకం లేదు. సున్నా వడ్డీకి అప్పులు ఇవ్వాలనే ఆలోచన చేసిన నాథుడు లేరు’ అని 2019 జులై 8న రైతు దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులో ఆయన సెలవిచ్చారు. నిజానికి సున్నా వడ్డీ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే అమలైంది. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ కింద    రూ.630 కోట్లు ఇచ్చారని ఆయనే అసెంబ్లీలో చెప్పారు. అలాంటప్పుడు సున్నా వడ్డీ ఉన్నట్లా? లేనట్లా? రైతులు గడువులోగా పంట రుణాలు చెల్లిస్తే.. తక్షణమే సున్నా వడ్డీ వర్తింపజేశారు. వైకాపా వచ్చాక ఆ విధానానికి స్వస్తి పలికారు.


పావలా వడ్డీ ఎత్తేసిన పాపం ఎవరిది?

రైతులు తీసుకున్న మొత్తం పంట రుణాలకు సున్నా వడ్డీ వర్తింపజేయడం లేదు. రూ.లక్ష వరకే అని గతంలో ఉన్న నిబంధననే అమలు చేశారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల రుణాలపై 1% వడ్డీ ప్రభుత్వమే చెల్లించేది. దీన్ని పావలావడ్డీ పేరుతో అమలు చేశారు. జగన్‌ సీఎం అయ్యాక ఈ పథకం ఊసే లేదు. పూర్తిగా ఎత్తేశారు. రైతులపై వడ్డీ భారం మోపారు. అంటే అటు సున్నా వడ్డీ ఇవ్వలేదు. ఇటు పావలా తీసేసి.. రైతులపై వడ్డీభారం మోపారు. ఇంతా చేసి... తాజా  మ్యానిఫెస్టోలో మళ్లీ సున్నావడ్డీ అనే పాట ఎత్తుకున్నారు జగన్‌!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని