‘బందోబస్తు’ బహుపరాక్‌!

సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 08 May 2024 06:27 IST

ప్రణాళికలను పునఃసమీక్షించాల్సిందే
పోలింగ్‌ వేళ దాడులతో పైచేయి సాధించేందుకు వైకాపా కుటిల వ్యూహం
తదనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించిన ఆ పార్టీ వీరభక్త పోలీసు అధికారులు
డీజీపీ వెంటనే దాన్ని సరిదిద్దితేనే స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం
వైకాపాతో అంటకాగుతున్న పలువురు అధికారులను ఏరివేయాలి
అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల్ని దించాల్సిందే
ఈనాడు - అమరావతి

సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక స్థానాల్లో కొనసాగిన వైకాపా బంటులైన అధికారులను అడ్డం పెట్టుకొని.. అందుకు అనుకూలంగా బందోబస్తు ప్రణాళికలు రూపొందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలను మార్చినంత మాత్రాన సరిపోదు. బందోబస్తు ప్రణాళికను క్షుణ్ణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గాల పరిధిలో ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేకాధికారులను పంపించాలి. అధికార వైకాపాకు పట్టున్న పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బందోబస్తును ఒకరితో సరిపెట్టేయటం.. తెదేపా, ప్రతిపక్షాలకు పట్టున్న చోట్ల అవసరానికి మించి బలగాలను పంపడం వంటి అసమతౌల్యతలను పరిశీలింపజేయాలి. పాత బందోబస్తు ప్రణాళిక స్థానంలో తక్షణమే కొత్తది రూపొందించాలి. పోలింగ్‌కు మరో అయిదు రోజులే గడువున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకొని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వైకాపాతో అంటకాగిన అధికారులు రూపొందించిన బందోబస్తు ప్రణాళికనే అమలు చేస్తే.. స్వేచ్ఛ, శాంతియుత ఎన్నికల నిర్వహణ అసాధ్యం.

వారిపై వేటు వేయాల్సిందే...

ఎన్నికల వేళ అనుకూలమైన అధికారులుంటే.. వారిని అడ్డం పెట్టుకొని ఏదోరకంగా గెలవొచ్చనే దురుద్దేశంతో వైకాపా నాయకులు షెడ్యూల్‌ రాకమునుపే వారికి కావాల్సిన అధికారులను ఏరికోరి మరీ తెచ్చిపెట్టుకున్నారు. వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేసే వారినే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలుగా నియమించుకున్నారు. వారిని అడ్డం పెట్టుకొని పోలింగ్‌ రోజున ప్రతిపక్షాల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసే కుట్రలను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేసిన కుట్రపూరిత చర్యలనే మరింత ఉద్ధృతంగా చేపట్టాలని చూస్తున్నారు. తీవ్ర హింసాత్మక ఘటనలకు పాల్పడి.. తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులను ఓటింగ్‌కు రానివ్వకుండా అడ్డుకోవటం, ప్రతిపక్షాల తరఫున ఏజెంట్లుగా కూర్చునే వారిని బెదిరించటం, వారిపై దాడులు చేయటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న ముసుగులో విపక్షాల వారిని గృహనిర్బంధం చేయించటం వంటి దుశ్చర్యలకు తెగబడేందుకు స్కెచ్‌ గీశారు. ఈ కుట్ర అమలుకు వీలుగా బందోబస్తు ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా.. తక్షణం ఆ కుటిల వ్యూహాల్ని నిర్వీర్యం చేయాలి. వాటిల్లో భాగస్వాములైన ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను అక్కడి నుంచి తప్పించాలి. వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి.

అక్రమ కేసుల్ని సమీక్షించాలి.. రౌడీషీట్లను పునఃపరిశీలించాలి

అధికార వైకాపా బంటుల్లా పనిచేస్తున్న అధికారులు కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీల శ్రేణులను పెద్దఎత్తున బైండోవర్‌ చేస్తున్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కొందరిపై పక్షపాతంగా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఏకంగా హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద ఇరికిస్తున్నారు. పాత కేసులను తిరగదోడుతూ బెదిరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి అనుమతులివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా నాయకులు దాడులు, దాష్టీకాలు, దమనకాండకు పాల్పడుతుంటే వాటిల్లో ఏ ఒక్క ఘటనలోనూ చర్యలు తీసుకోవట్లేదు. నిందితుల్ని అరెస్టు చేయట్లేదు. పైగా బాధితులపైనే కేసుల నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో క్రియాశీలకంగా ఉంటున్న వారిని అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం ద్వారా బదిలీ వేటుకు గురైన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, మహబూబ్‌ బాషాలే దీనికి ఓ ఉదాహరణ. ఇలాంటి అధికారులు తెదేపా సహా ఇతర ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై గత నెల రోజుల వ్యవధిలో పెట్టిన బైండోవర్లు, అక్రమ కేసుల్ని నూతన డీజీపీ సమీక్షించాలి. వారిపై తెరిచిన రౌడీషీట్లను పునఃపరిశీలించాలి. కేవలం ప్రతిపక్షాల్ని వేధించటం, క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని కట్టడి చేయటమే లక్ష్యంగా పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలి. లేకపోతే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి బలాలు దెబ్బతింటాయి.

దారులన్నీ మూసుకుపోవటంతో..

వైకాపా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజురోజుకు ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లుతుండటం, గెలిచే దారులన్నీ మూసుకుపోతుండటంతో హింస, దాడులు, దౌర్జన్యాన్ని నమ్ముకుని పైచేయి సాధించాలని భావిస్తోంది. ‘‘ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలన్నింటిలో పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలి. వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న పోలీసు అధికారులను అక్కడి నుంచి తప్పించి వారి స్థానంలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండే వారిని నియమించాలి. ఆ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలన్నింటిలోనూ వెబ్‌కాస్టింగ్‌ చేపట్టాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు చేయాలి. ఏదైనా ఘటన జరిగినా, నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకోగలిగేలా సమీపంలో రిజర్వు బలగాల్ని ఉంచాలి. ఆయా నియోజకవర్గాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నియమించాలి’’ అని విపక్షాలు కోరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని