పెట్టుబ‌డుల‌ను స‌ర్దుబాటు చేస్తున్నారా?

మ‌న దేశంలో మ‌దుప‌ర్లు స్థిరాస్తి పై పెట్టుబ‌డి చేయ‌డం చాలా భ‌ద్రంగా ఉంటుంద‌నే విశ్వాసాన్ని క‌లిగిఉంటారు . దీని త‌రువాత స్థానం బంగారానికి ద‌క్కుతుంద‌ని చెప్పాలి. అయితే ఇవి రెండే పెట్టుబ‌డి వ‌ర్గాలు (అసెట్ క్లాసులు) ఉన్నాయా ? ఈక్విటీ, స్థిరాదాయ (డెట్) ప‌థ‌కాలు కూడా ఉన్నాయి....

Updated : 02 Jan 2021 15:56 IST

మ‌న దేశంలో మ‌దుప‌ర్లు స్థిరాస్తి పై పెట్టుబ‌డి చేయ‌డం చాలా భ‌ద్రంగా ఉంటుంద‌నే విశ్వాసాన్ని క‌లిగిఉంటారు . దీని త‌రువాత స్థానం బంగారానికి ద‌క్కుతుంద‌ని చెప్పాలి. అయితే ఇవి రెండే పెట్టుబ‌డి వ‌ర్గాలు (అసెట్ క్లాసులు) ఉన్నాయా ? ఈక్విటీ, స్థిరాదాయ (డెట్) ప‌థ‌కాలు కూడా ఉన్నాయి. మ‌దుప‌ర్లు వీటిలో కూడా త‌మ పెట్టుబ‌డిని స‌ర్దుబాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే వైవిధ్య‌త అనేది పెట్టుబ‌డుల‌కు చాలా ముఖ్యం. వారెన్ బ‌ఫెట్ ఆచ‌రించే సిద్దాంతం అన్ని గుడ్ల‌ను ఒకే బాస్కెట్ లో పెట్ట‌డం కంటే ఒక్కోబాస్కెట్‌లో కొన్ని గుడ్లు చొప్పున పెట్ట‌డం మంచిది. దీని మూలంగా రిస్క్ త‌గ్గుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు డ‌జ‌ను గుడ్ల‌ను ఒకే బాస్కెట్ లో పెట్టాక అది కాస్త‌ కింద‌ ప‌డితే మొత్తం గుడ్లు ప‌గిలిపోతాయి. అదే మూడు బాస్కెట్ల‌లో నాలుగేసి గుడ్ల‌ను దాచుకుంటే ఒక బాస్కెట్ జారిన ఇంకా రెండు బాస్కెట్లు చాలా భ‌ద్రంగా ఉంటాయి. అప్పుడు మ‌న‌కు 8 గుడ్లు మిగులుతాయి. ఇదే సిద్దాంతం పెట్టుబ‌డుల‌కు కూడా అన్వ‌యిస్తే చేసే పెట్టుబ‌డుల‌న్నీ ఒకే ఆసెట్ క్లాస్ (ఒకే ర‌క‌మైన ఆస్తి వ‌ర్గం) లో మ‌దుపు చేయ‌డం మంచిది కాదు. ఏవైనా స‌మ‌స్య‌లు త‌లెత్తి ఆ కేట‌గిరీకి చెందిన ఆస్తి విలువ త‌గ్గితే మ‌నం చేసిన పెట్టుబ‌డి క‌ళ్ల ముందే ఆవిర‌య్యే అవ‌కాశం ఉండొచ్చు. కాబ‌ట్టి మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బునే వేర్వేరు పెట్టుబ‌డుల‌లో పెట్ట‌డం ద్వారా వైవిధ్య‌త పెరిగి న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది.

పెట్టుబ‌డుల్లో న‌ష్ట‌భ‌యం ఏవిధంగా ఉంటుందంటే…

  • ఒకే పెట్టుబ‌డి వ‌ర్గం (అసెట్ క్లాసు) లో మొత్తం పెట్టుబ‌డులు చేస్తే న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది.
  • వివిధ ర‌కాల అసెట్ క్లాసుల్లో పెట్టుబ‌డులు చేసిన‌పుడు న‌ష్ట‌భ‌యం పై దానికంటే త‌క్కువ‌గా ఉంటుంది.
  • వివిధ అసెట్ క్లాసుల‌కు చెందిన‌, వివిధ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు చేసిన‌పుడు న‌ష్ట‌భ‌యం మ‌రింత త‌గ్గుతుంది.

వీటిని ఉదాహ‌ర‌ణల‌తో కింద చూద్దాం.

ఒకే పెట్టుబ‌డి వ‌ర్గం (అసెట్ క్లాసు) లో మొత్తం పెట్టుబ‌డులు చేస్తే న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ 1:

ఒక మ‌దుప‌రి త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ. 10 వేల‌ను మొత్తం ఒకే మ్యూచువ‌ల్ ఫండ్ లో పెట్టుబ‌డి చేశారు. ఫండ్ ప‌నితీరు బాగులేక పోవ‌డంతో అత‌ని వ‌ద్ద ఉన్న యూనిట్ల ధ‌ర‌ త‌గ్గుతూ వ‌చ్చింది. ఎంత‌కీ అవి వృద్ధి చెంద‌డంలేదు. ఆ స‌మ‌యంలో విక్ర‌యించాల్సి వ‌స్తే పెట్టుబ‌డి విలువ కంటే త‌క్కువ డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దీనికి కార‌ణం ఆ వ్య‌క్తి మొత్తం పెట్టుబ‌డిని ఒకే ఫండ్ లో పెట్టుబ‌డి చేయ‌డ‌మే…

వివిధ కేట‌గిరీల్లో పెట్టుబ‌డులు చేసిన‌పుడు పై దానికంటే త‌క్కువ‌గా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ 2:

ఒక వ్య‌క్తి త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ. 10 వేల‌ను పెట్టుబ‌డి చేసేందుకు ఈక్విటీ, స్థిరాదాయ రెండు వ‌ర్గాల‌ను ఎంచుకున్నారు. అందులో రూ.4 వేలు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లో, మిగిలిన రూ. 6 వేలు డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టారు. ఇక్క‌డ ఆ వ్య‌క్తి పెట్టుబ‌డుల‌ను రెండింటిలో చేయ‌డం ద్వారా వైవిధ్య‌త‌ను పొందాడు. ఒక వేళ ఈక్విటీఫండ్ ప‌నితీరు బాగోకపోయినా స్థిరాదాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి స్థిరంగానే ఉండేందుకు వీలు ఉంటుంది. త‌ద్వారా ఆయ‌న సంప‌ద ఉన్న‌ప‌లంగా త‌గ్గిపోద‌నే చెప్పాలి.

వివిధ అసెట్ క్లాసుల‌కు చెందిన‌, వివిధ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు చేసిన‌పుడు న‌ష్ట‌భ‌యం మ‌రింత త‌గ్గుతుంది.

ఉదాహ‌ర‌ణ 3:

ఒక వ్య‌క్తి త‌న ద‌గ్గ‌ర ఉన్న పెట్టుబ‌డి రూ.10 వేల‌ను ఈక్విటీ లో రెండు ఫండ్లు, డెట్ లో రెండు ఫండ్లు అంటే మొత్తం నాలుగు ఫండ్ల‌లో స‌మానంగా రూ.2,500 చొప్పున పెట్టుబ‌డి పెట్టారు. అప్పుడు ఆ పోర్టుఫోలియో మ‌రింత వైవిధ్య‌త క‌లిగింది. ఒకే కేట‌గిరీకి చెందిన‌ ఫండ్ల రాబ‌డి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుంది. అంటే ఆయా ఫండ్ల మేనేజ‌ర్లు తీసుకునే వ్యూహాల‌ను బ‌ట్టి వాటి ప‌నితీరు ఆధార‌ప‌డి ఉంటుంది.

రెండో ఉదాహ‌ర‌ణ‌లో ఒకే ఈక్విటీ ఫండ్ లో పెట్టుబ‌డి చేస్తే ఆ ఫండ్ ప‌నితీరు బాగులేకుంటే మ‌దుప‌రి కొంత మేర‌కు న‌ష్ట‌పోవ‌చ్చు. ఈ సంద‌ర్భంలో ఒక్కో కేట‌గిరీకి చెందిన రెండు ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టారు కాబ‌ట్టి ఇందులో ఒక ఫండ్ ప‌నితీరు బాగులేకున్నా మ‌రో ఫండ్ మంచి రాబ‌డి తెచ్చి పెట్ట‌వ‌చ్చు. త‌ద్వారా న‌ష్ట‌భ‌యం మ‌రింత త‌గ్గుతుంది. ఇదే విధానం డెట్ ఫండ్ల‌కు కూడా వ‌ర్తిస్తుంది. అయితే సాధార‌ణంగా డెట్ ఫండ్ల‌ విష‌యంలో ఫండ్ల మ‌ధ్య రాబ‌డి వ్య‌త్యాసం త‌క్కువ‌గానే ఉంటుంద‌ని చెప్పాలి.

చివ‌రిగా చెప్పేదేంటంటే…
మ‌దుప‌ర్లు సిప్ లేదా లంప్‌స‌మ్ గా పెట్టుబ‌డి చేసేట‌పుడు ఒకే చోట కాకుండా వివిధ ప‌థ‌కాల్లో స‌ర్దుబాటు చేయ‌డం వ‌ల్ల రిస్క్ త‌గ్గుతుంది.మ్యూచువ‌ల్ ఫండ్లల‌తో పాటు బంగారం, స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు,పోస్టాఫీసు ప‌థ‌కాలు త‌దిత‌ర వాటిలో త‌మ పెట్టుబ‌డుల‌ను విభ‌జించి మ‌దుపు చేయ‌డం ద్వారా వైవిధ్య‌త‌ను తీసుకురావొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని