Automobile retail sales: 2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!

Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు.

Published : 08 Apr 2024 12:24 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రయాణికుల, త్రిచక్ర వాహనాలు సహా ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది.

అన్ని విభాగాల్లో కలిపి 2023- 24లో 2,45,30,334 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2022-2023లో నమోదైన 2,22,41,361 వాహనాలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్రయాణికుల వాహన విక్రయాలు ఎనిమిది శాతం వృద్ధితో 39,48,143 యూనిట్లకు చేరాయి. వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు అందుకు దోహదం చేసినట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు.

త్రిచక్ర వాహన విక్రయాలు 49 శాతం పెరిగి 11,65,699 యూనిట్లకు చేరాయి. అందుబాటు ధరలో సీఎన్‌జీ వాహనాలు, విద్యుత్తు మోడళ్లు, నాణ్యమైన సర్వీసు వంటి అంశాలు ఈ విభాగంలో విక్రయాలకు ఊతమిచ్చినట్లు సింఘానియా పేర్కొన్నారు. మరోవైపు ట్రాక్టర్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8,29,639 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగి 8,92,313 యూనిట్లకు చేరాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం కలిసొచ్చిందని తెలిపారు. వాణిజ్య వాహన విక్రయాలు ఐదు శాతం వృద్ధితో 10,07,006 యూనిట్లకు చేరాయి.

మార్చిలో ఇలా..

మార్చి నెలలో వాహన రిజిస్ట్రేషన్లు మూడు శాతం పెరిగి 21,27,177 యూనిట్లకు చేరాయి. ప్యాసెంజర్‌ వాహనాలు 6 శాతం పెరిగి 3,22,345 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 5 శాతం వృద్ధితో 15,29,875 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 17 శాతం వృద్ధితో 1,05,222 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం ఆరు శాతం కుంగి 91,289 యూనిట్లకు పడిపోయాయి. ట్రాక్టర్ల అమ్మకాలు సైతం మూడు శాతం తగ్గి 78,446 యూనిట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని