Musk: విద్యుత్‌ వాహన రంగాన్ని చైనా కంపెనీలు కొల్లగొడతాయ్‌: మస్క్

Musk: విద్యుత్‌ వాహన రంగంలో చైనా సంస్థల నుంచి టెస్లాకు ఎదురవుతున్న పోటీపై కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 25 Jan 2024 17:30 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయ వాణిజ్యంపై నియంత్రణలు లేకపోతే.. చైనా వాహన తయారీ సంస్థలు ఇతర దేశాల వ్యాపారాన్ని పూర్తిగా కొల్లగొడతాయని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆందోళన వ్యక్తం చేశారు. పరోక్షంగా విద్యుత్‌ వాహన (Electric Vehicles) రంగంలో బీవైడీ వంటి చైనా సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు బీవైడీ ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

టెస్లాతో (Tesla) పోలిస్తే బీవైడీ తక్కువ ధరకే విద్యుత్‌ కార్లను తీసుకొస్తోంది. గత త్రైమాసికంలో టెస్లాను అధిగమించి అత్యధిక ఈవీలను విక్రయించిన సంస్థగా నిలిచింది. పోటీని తట్టుకునేందుకు టెస్లా భారీ స్థాయిలో ధరల్ని తగ్గించినప్పటికీ.. అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చైనా కార్ల కంపెనీలు ఆ దేశం వెలుపల మంచి విజయాన్ని అందుకుంటాయని అనలిస్ట్‌లతో జరిగిన సమావేశంలో మస్క్‌ అన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య నియంత్రణలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇతర కంపెనీల వ్యాపారాన్ని అవి పూర్తిగా కొల్లగొడతాయని అభిప్రాయపడ్డారు.

ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఇప్పటికీ తమకు ఎలాంటి అవకాశాలు కనిపించడం లేదని మస్క్‌ (Elon Musk) అన్నారు. తమ సూపర్‌ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను ఇతర కంపెనీలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పూర్తిస్థాయి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీని సైతం ఆఫర్‌ చేయడానికి సుముఖంగా ఉన్నామన్నారు. తమకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర సాంకేతికతల లైసెన్స్ ఇవ్వడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఇంధన విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు.

టెస్లా (Tesla) కార్లకు చైనాలో క్రమంగా గిరాకీ క్షీణిస్తోంది. నాయకులు, అధికారులు ఈ కార్లను వాడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడమే అందుకు కారణం. ఫలితంగా టెస్లా పలు దఫాల్లో ధరల్ని గణనీయంగా తగ్గించింది. అయినప్పటికీ.. బీవైడీ నుంచి ఎదురవుతున్న పోటీని మాత్రం అధిగమించలేకపోయింది. ఐరోపా దేశాల్లోనూ ధరల్ని కుదించాల్సి వచ్చింది. ఫలితంగా గత రెండు త్రైమాసికాలు కంపెనీ లాభాల్లో క్షీణత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు