LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 పెంపు

LPG Cylinder Price: అంతర్జాతీయ ధరల్లో మార్పులకు అనుగుణంగా వాణిజ్య వంట గ్యాస్‌, విమాన ఇంధన ధరలను సవరించినట్లు ఇంధన రిటైల్‌ కంపెనీలు వెల్లడించాయి.

Published : 01 Dec 2023 15:31 IST

దిల్లీ: వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది (commercial LPG rate hike). 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.21 ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1,796.50కు చేరింది. ముంబయిలో ఈ ధర రూ.1,749గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సవరణలు చేసినట్లు ఇంధన రిటైల్‌ కంపెనీలు తెలిపాయి. అదే సమయంలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.903 వద్ద స్థిరంగా ఉంది.

మరోవైపు విమాన ఇంధన (Aviation turbine fuel- ATF) ధరల్లో ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ కంపెనీలు మరోసారి కోత విధించాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్‌ ధర రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. ఏటీఎఫ్‌ ధరను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌ 1న కిలోలీటర్‌పై రూ.6,854.25 తగ్గిన విషయం తెలిసిందే. అంతకుముందు జులై 1 నుంచి నాలుగు దశల్లో కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను రూ.29,391.08 పెంచాయి. తాజాగా రెండుసార్లు తగ్గించడంతో విమానయాన సంస్థలపై కొంత మేర భారం తగ్గినట్లయింది.

మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 దగ్గర ఉంది. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన 2022 మేలో ఇంధన రిటైల్‌ కంపెనీలు ధరల్ని సవరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని