IRCTC tour package: ₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్‌ నుంచి రైలు

IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

Updated : 07 Jun 2024 19:08 IST

అరుణాచలం

IRCTC tour package | ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చూస్తున్నారా? అయితే మీ కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) మరో భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్‌ గౌరవ్‌ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్‌ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్‌, తెనాలి, వరంగల్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.

మీనాక్షి అమ్మవారి ఆలయం

ప్రయాణం ఇలా..

 • సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరుతుంది.
 • రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో సేద తీరాక.. ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని కుదల్‌నగర్‌కు పయనమవుతారు.
 • మూడోరోజు ఉదయం 6:30 గంటలకు కుదల్‌నగర్‌ చేరుకుంటారు. అక్కడినుంచి బస్సులో రామేశ్వరం చేరుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వీటి ప్రయాణ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది. ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో భోజనం ఉంటుంది. ఆ రోజు రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది.
 • నాలుగో రోజు మధ్యాహ్నం భోజనం ముగించుకొని మదురైకు ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని షాపింగ్‌ చేసుకోవచ్చు. అనంతరం రైల్వేస్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారికి ప్రయాణమవుతారు.
 • ఐదో రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వివేకానంద రాక్‌ మెమోరియల్‌, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి సేదతీరాల్సి ఉంటుంది.
 • ఆరో రోజు ఉదయమే కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ చేరుకొని తిరువనంతపురం (కొచ్చువేలి) బయల్దేరుతారు. అక్కడే అల్పాహారం ముగించుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని కోవలం బీచ్‌ అందాలు వీక్షిస్తారు. తిరిగి కొచ్చువేలి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరుచిరాపల్లికి ప్రయాణమవుతారు.
 • ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. ఉదయం శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మధ్యాహ్నం భోజనం ముగించుకుంటారు. అనంతరం తంజావూర్‌ చేరుకొని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం తంజావూర్‌లో సికింద్రాబాద్‌ రైలు ఎక్కుతారు.
 • ఎనిమిదో రోజు మొత్తం ప్రయాణమే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్‌ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

వివేకానంద రాక్‌ మెమోరియల్‌

ప్యాకేజ్‌ ఛార్జీలు..

 • ఎకానమీలో ఒక్కో టికెట్‌ ధర రూ.14,250; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.13,250 చెల్లించాలి.
 • స్టాండర్డ్‌లో రూ.21,900; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.20,700 చెల్లించాలి.
 • కంఫర్ట్‌లో రూ.28,450; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.

ఫుడ్‌ ఐఆర్‌సీటీసీదే..

 • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు.
 • యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
 • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాలి.
 • పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు