Insurance Companies: క్లెయిమ్‌ల విషయంలో పారదర్శకత పాటించాలి

బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్‌డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్‌ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూచించింది

Published : 07 Jun 2024 00:33 IST

బీమా సంస్థలను ఆ దిశగా ఆదేశించాలి

ఐఆర్‌డీఏఐకి సూచించిన వినియోగదారుల కమిషన్‌

బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్‌డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్‌ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూచించింది. క్లెయిమ్‌లను పరిష్కరించే క్రమంలో అన్యాయమైన పద్ధతులను పాటిస్తూ, పాలసీదారులను బీమా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చాలా బీమా సంస్థలు సహేతుక కారణాలు లేకుండానే క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయని కమిషన్‌ తెలిపింది. ఇలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని సూచించింది. 

ఇదీ నేపథ్యం...

రంజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి 2019లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి అయిదేళ్ల వ్యవధికి రూ.16లక్షల గృహరుణం తీసుకున్నారు. ఈ అప్పు తీసుకునేటప్పుడు బ్యాంకు ఉద్యోగులు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ నుంచి బీమా పాలసీ తీసుకోవాలని తెలిపారు. ఊహించని అనారోగ్యం, ప్రమాదాలు, ఉద్యోగం కోల్పోవడం తదితర సందర్భాల్లో బీమా కంపెనీ రుణ మొత్తాన్ని చెల్లిస్తుందని తెలిపారు. దీంతో రంజిత్‌ సింగ్‌ హోమ్‌ క్రెడిట్‌ అస్యూర్‌ పాలసీని తీసుకున్నారు. దీనికోసం రూ.1,00,656 ప్రీమియం చెల్లించారు. 2019లో తీసుకున్న ఈ బీమా పాలసీ డిసెంబరు 2024 వరకు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది.

2021లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా సింగ్‌ మరణించారు. ఆయన భార్య శుభ్‌ లతా పాలసీకి నామినీగా ఉన్నారు. హోమ్‌ క్రెడిట్‌ అస్యూర్‌ పాలసీ కింద రుణ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోకు క్లెయిమ్‌ దాఖలు చేశారు. బీమా సంస్థ దీన్ని తిరస్కరించింది. దీంతో రుణాన్ని చెల్లించాల్సిందిగా బ్యాంకు ఒత్తిడి చేయడంతో, లత జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. బీమా సంస్థ రుణాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అక్కడ లతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై బీమా సంస్థ, బ్యాంకు రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేశాయి.

దీనిని విచారించిన రాష్ట్ర కమిషన్‌.. సింగ్‌ తీవ్ర వ్యాధితో బాధపడుతూ మరణించినట్లు గుర్తించింది. సింగ్‌కు వచ్చిన వ్యాధిని ‘మేజర్‌ మెడికల్‌ ఇల్‌నెస్‌’గా భావించి, పరిహారం చెల్లించాలని పేర్కొంది. లత క్లెయిమ్‌ను తిరస్కరించేందుకు బీమా కంపెనీ ఎలాంటి సహేతుక కారణాలు, సాక్ష్యాలనూ చూపలేదని పేర్కొంటూ, లతకు అనుకూలంగా రాష్ట్ర కమిషన్‌ తీర్పును వెల్లడించింది. దీన్ని బట్టి, బీమా కంపెనీ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తీర్పును వెల్లడించే క్రమంలో ఐఆర్‌డీఏఐకు కమిషన్‌ పై సూచనలు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని