Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్‌ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్‌

Hero MotoCorp: ప్రీమియం బైక్‌లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్‌ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు.

Published : 18 Feb 2024 12:29 IST

Hero MotoCorp | దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమ ఆదాయపరంగా రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని హీరోమోటోకార్ప్‌ (Hero MotoCorp) సీఈఓ నిరంజన్‌ గుప్తా అంచనా వేశారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్‌ మరింత పుంజుకుంటుందని తెలిపారు. అధిక ఫీచర్లు ఉన్న బైక్‌లపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఎంట్రీ లెవెల్‌ మోడళ్లకు ఆదరణ తగ్గిందని.. ఇటీవల ఆ విభాగంలోనూ విక్రయాలు పుంజుకున్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సెంటిమెంట్‌ మెరుగవుతోందని తెలిపారు.

ఇప్పటికే హీరోమోటోకార్ప్‌ (Hero MotoCorp) దేశవ్యాప్తంగా తమ 300 డీలర్‌షిప్‌లను ప్రీమియం మోడల్స్‌ను విక్రయించే స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసిందని నిరంజన్‌ గుప్తా తెలిపారు. వచ్చే ఏడాదికల్లా 500 స్టోర్లను ఉన్నతీకరిస్తామని చెప్పారు. వీటితో పాటు కేవలం ప్రీమియం మోడళ్ల కోసం 100 ప్రీమియా స్టోర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తద్వారా దేశవ్యాప్తంగా తమ ప్రీమియం మోడళ్లు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

భారత విపణి కోసం హార్లీ డేవిడ్‌సన్‌, హీరోమోటోకార్ప్‌ 2020లో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా హార్లీ డేవిడ్‌సన్‌ బ్రాండ్‌ పేరిట హీరో మోటోకార్ప్‌ బైక్‌లను అభివృద్ధి చేసి ఇక్కడ విక్రయిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తీసుకొచ్చిన హార్లీ ఎక్స్‌440కి మంచి ఆదరణ లభించింది. ఇటీవల మావ్రిక్‌ 440ని సైతం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని