బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!

దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

Published : 29 Apr 2024 02:09 IST

ఈ ఆర్థిక సంవత్సరంపై ఎస్‌అండ్‌పీ అంచనా

దిల్లీ: దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే బ్యాంకుల డిపాజిట్లలో వృద్ధి అధికంగా లేనందున, రుణ వితరణలో పెరుగుదల కూడా నెమ్మదించొచ్చని పేర్కొంది. 2024 రెండో త్రైమాసికానికి సంబంధించి ఆసియా పసిఫిక్‌ బ్యాంక్‌ అప్‌డేట్‌ పేరిట నివేదికను ఎస్‌అండ్‌పీ విడుదల చేసింది. ఈ ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో బ్యాంకు రుణాల్లో వృద్ధి 16% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 14 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. రిటైల్‌ డిపాజిట్లలో వృద్ధి నెమ్మదించడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఏ బ్యాంకును తీసుకున్నా, డిపాజిట్ల కంటే రుణ వృద్ధి 2-3 పర్సంటేజీ పాయింట్లు అధికంగా ఉంటున్నట్లు వివరించింది. అందువల్ల తమ డిపాజిట్లలో వృద్ధికి అనుగుణంగానే రుణ వితరణను తీసుకొచ్చేందుకు బ్యాంకులు ప్రయత్నించే అవకాశం ఉంది. లేకపోతే కనుక, రుణ వితరణ కోసం అధిక వడ్డీపై నిధులను బ్యాంకులు  సమీకరించాల్సి వస్తుంది, ఇందువల్ల బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం పడుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నికితా ఆనంద్‌ తెలిపారు. సాధారణంగా ప్రైవేటు బ్యాంకుల రుణ వృద్ధి 17-18% ఉంటుంటే, ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వృద్ధి 12-14 శాతంగా ఉంటోందని గుర్తు చేశారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం నామనిల్‌ జీడీపీ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్ల వృద్ధి ఉంటే, ఇందుకు   1.5 రెట్లు అధికంగా రుణ వృద్ధి ఉండొచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని