పెట్టుబడికి బంగారు బాట...

ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు.

Published : 10 May 2024 01:12 IST

 బంగారం.. ఎన్నటికీ వన్నె తగ్గని లోహం.. తరగని సంపదకు చిహ్నం. పెట్టుబడిగానూ ఆకర్షణీయమే. అక్షయ తృతీయ నాడు పసిడి కొంటే శుభం కలుగుతుందని ఎంతోమంది విశ్వసిస్తారు. ధరతో సంబంధం లేకుండా గ్రాము బంగారమైనా కొనాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో పసిడిని పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు ఏం చేయాలన్నది తెలుసుకుందాం.

విలువ పెరుగుతూనే ఉంది..

2004 నుంచి బంగారంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున మదుపు చేస్తూ వస్తున్నారనుకుందాం. ఇప్పటికి దాని విలువ రూ.1.15 కోట్లకు చేరేది. 2023 అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకూ బంగారం దాదాపు 18.78 శాతం వరకూ రాబడినిచ్చింది. ఏడాది క్రితం పసిడిలో మదుపు చేసిన వారికి అధిక ప్రతిఫలం కనిపించింది.

ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతోమంది పసిడిని భౌతిక రూపంలో (ఆభరణాలు, నాణేలు, కడ్డీలు) కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండటంతో, దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది.

ఆభరణాల రూపంలో..

శుభకార్యాల వేళ ఆభరణాల ధగధగలు కొత్త శోభను తీసుకొస్తాయి. అందుకే, చాలామంది ఈ రూపంలోనే పసిడిని కొంటారు. అవసరమైనంత మేరకు నగలను కొనుగోలు చేయడం మంచిదే. అదీ నాణ్యమైన బంగారాన్ని విక్రయించే దుకాణాల నుంచి, అన్ని బిల్లులతో వీటిని కొనుగోలు చేయాలి. జీఎస్‌టీ ఉండదని, ఇతర కారణాలతో ఎక్కడపడితే అక్కడ కొంటే భవిష్యత్తులో చిక్కులు రావచ్చు. మరోసంగతీ గుర్తుంచుకోండి. రూ.2లక్షలకు మంచి విలువైన కొనుగోళ్లు చేసినప్పుడు తప్పనిసరిగా పాన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆభరణానికీ బీఐఎస్‌ లోగో తప్పనిసరి. దీంతోపాటు ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ హెచ్‌యూఐడీ కోడ్‌ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇవి లేకుండా నగలను కొనుగోలు చేయడం సురక్షితం కాదు. కొన్ని బంగారం విక్రయ దుకాణాలు ప్రత్యేక పొదుపు పథకాలను అందిస్తున్నాయి. వ్యవధి తీరిన తర్వాత బంగారం కొనాలని అనుకున్నప్పుడే వీటిని పరిశీలించాలి.

ఈటీఎఫ్‌ల ద్వారా..

ఎలక్ట్రానిక్‌ రూపంలో బంగారాన్ని కొనేందుకు వీలు కల్పించే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. డీమ్యాట్‌ ఖాతా ఉన్న వారు బంగారాన్ని సులభంగా ఎలక్ట్రానిక్‌ రూపంలో క్రయవిక్రయాలు చేయొచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ప్రతి యూనిట్‌ 99 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతునిస్తుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీ పనివేళల్లో ఎప్పుడైనా సరే వీటిని కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు. బంగారం డీమ్యాట్‌లో ఉంటుంది కాబట్టి, భద్రత గురించి ఆందోళన అక్కర్లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. పైగా రుసుములూ తక్కువ. మొత్తం పెట్టుబడుల్లో వీటికి కొంత మేర కేటాయించడం ద్వారా నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు వీలవుతుంది.

సార్వభౌమ పసిడి బాండ్లలో..

బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీ). వీటిని ఆర్‌బీఐ సమయానుకూలంగా జారీ చేస్తుంటుంది. ఒక వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్‌ విధానంలో దరఖాస్తు చేసిన చిన్న మదుపరులకు గ్రాముపై రూ.50 తగ్గింపు ధర అందిస్తుంది. పెట్టిన పెట్టుబడిపై వార్షిక వడ్డీ 2.5 శాతం చొప్పున ఆరు నెలలకోసారి చెల్లిస్తుంది. డీమ్యాట్‌ ఖాతా, బ్యాంకు ఖాతా ద్వారా వీటిలో మదుపు చేయొచ్చు. ఈ బాండ్ల వ్యవధి 8 ఏళ్లు. అయిదేళ్ల తర్వాత ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వీటిపై మూలధన రాబడి పన్ను ఉండదు.  

ఫండ్లూ ఉన్నాయి..

బంగారంలో పరోక్షంగా మదుపు చేసేందుకు గోల్డ్‌ ఫండ్లూ అందుబాటులో ఉన్నాయి. వీటికి డీమ్యాట్‌ ఖాతా అవసరం లేదు. కనీస పెట్టుబడి రూ.500లతోనూ ఇందులో మదుపు ప్రారంభించవచ్చు. మీ పెట్టుబడిని బంగారం గనుల కంపెనీల్లోనూ, భౌతిక బంగారంలోనూ ఫండ్‌ మేనేజర్లు మదుపు చేస్తారు. చాలా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలూ వీటిని అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బంగారంలో మదుపు ప్రారంభించాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు.

డిజిటల్‌లో..

ఇప్పుడు చాలా సంస్థలు బంగారాన్ని డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో చాలా తక్కువ మొత్తంతో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో అన్ని సంస్థలనూ నమ్మలేం. కొన్ని సంస్థలు మోసం చేసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని