Maruti Suzuki Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు

Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌లో కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.  

Published : 09 May 2024 15:22 IST

Maruti Suzuki Swift | దిల్లీ: భారత్‌లో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ఒకటి. దీని 2024 అప్‌డేటెడ్ వెర్షన్‌ గురువారం విడుదలైంది. ఫీచర్ల విషయంలో కొన్ని మార్పులు చేశారు. డిజైన్‌ను మాత్రం పెద్దగా మార్చలేదు.

స్విఫ్ట్‌లో కొత్తగా 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ జెడ్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను మారుతీ తీసుకొచ్చింది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు అనుసంధానించింది. 80 బీహెచ్‌పీ గరిష్ఠ శక్తితో పాటు 112 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. లీటర్‌కు 25.72 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

లోపలిభాగంలో ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తోంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త స్విఫ్ట్‌ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను మారుతీ ప్రామాణికం చేసింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ధరల శ్రేణి రూ.6.50 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతోంది.

డిజైన్‌ పరంగా చూస్తే బంపర్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు. వెనకభాగంలోనూ స్కిడ్‌ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్‌ను ఇచ్చారు. సి-ఆకారపు డీఆర్‌ఎల్‌లతో ప్రత్యేకమైన లైట్లను పొందుపర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని