ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్‌.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్‌ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

Published : 04 May 2024 16:43 IST

దిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తన బ్యాగేజీ పాలసీని మార్చింది. దేశీయ విమాన ప్రయాణాలకు ఫ్రీ బ్యాగేజీపై ఉన్న గరిష్ఠ పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్‌ ప్రయాణానికి గతంలో 20 కేజీలుగా ఉన్న బ్యాగేజీని 15 కేజీలకు కుదించింది. అంటే ఎవరైతే ఎకానమీలో కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్ ఫేర్‌ కేటగిరీ టికెట్లు తీసుకుంటారో వారు గరిష్ఠంగా ఇకపై 15 కేజీలు మాత్రమే చెక్‌-ఇన్‌ బ్యాగేజీకి అనుమతిస్తారు. ఈ కొత్త రూల్స్‌ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఎయిరిండియా 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతిచ్చేది. టాటా గ్రూప్‌ చేతికొచ్చాక గతేడాది ఆ పరిమితిని 20 కేజీలకు తగ్గించారు. తాజాగా ఫ్రీ బ్యాగేజీ పరిమితిని 15 కేజీలకు కుదించారు. కనీసం 15 కేజీల వరకు బ్యాగేజీని ఉచితంగానే అనుమతించాలని డీజీసీఏ ఆదేశాలున్నాయి. దీంతో దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే ఈ పరిమితిని అనుసరిస్తున్నాయి. అయితే, ఇతర సంస్థలు ఒక లగేజీని మాత్రమే అనుమతిస్తుండగా.. ఎయిరిండియా మాత్రం బరువు పరిమితికి లోబడి ఎన్ని బ్యాగుల్నైనా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.

ఎయిరిండియా వివిధ రకాల ఫేర్‌ తరగతులను గతేడాది ప్రవేశపెట్టింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌, ఫస్ట్‌క్లాస్‌లతో పాటు కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్‌, ఫ్లెక్స్‌ పేరిట మూడు ఉప తరగతులను తీసుకొచ్చింది. వీటిలో టికెట్‌ ధరతో పాటు ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ ఎకానమీ ఫ్లెక్స్‌ కేటగిరీలో టికెట్‌ ఎంచుకుంటే 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతిస్తారు. సాధారణంగా బరువు అనేది విమానం ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిరిండియా కొత్త బ్యాగేజీ పాలసీ కంపెనీ తన బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని