బ్యాంకింగ్‌ రంగంలో...

ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. యాక్సిస్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.

Published : 10 May 2024 01:11 IST

ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. యాక్సిస్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ బ్యాంక్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. బ్యాంకింగ్‌ రంగంలో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉన్న మదుపరులకు ఈ పథకం అనువుగా ఉంటుంది. ఆశిష్‌ నాయక్‌, కార్తీక్‌ కుమార్‌ ఈ ఫండ్‌ను నిర్వహిస్తారు.


పదవీ విరమణ నిధి కోసం..

 బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పదవీ విరమణ పథకాన్ని ఆవిష్కరించింది. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ రిటైర్‌మెంట్‌ ఫండ్‌ అనే ఈ పథకం ‘సొల్యూషన్‌ ఓరియంటెడ్‌’ విభాగానికి చెందినది కావడం గమనార్హం. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 22వ తేదీన ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 35+ 65 అగ్రెసివ్‌ ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. దేశంలో పదవీ విరమణ ప్రణాళికను సిద్ధం చేసుకోవటం, దానిని ఆచరణలో పెట్టటం ఎంతో అరుదు. కొద్దిమంది మా‌్రత్రమే దీన్ని ఆచరిస్తారు. కానీ ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది. పదవీ విరమణ తర్వాత ఎక్కువ కాలం జీవించే వారి సంఖ్య అధికం కావటమూ దీనికి వీలు కల్పిస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్‌మెంట్‌ పథకాలను వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఆవిష్కరిస్తున్నాయి. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ రిటైర్‌మెంట్‌ ఫండ్‌ ఈ కోవలోకి వచ్చే పథకమే. సమీకరించిన నిధులను 65- 80 శాతం వరకూ ఈక్విటీ షేర్లకు కేటాయిస్తారు. మిగిలిన సొమ్మును రుణ పత్రాలు, రీట్‌, ఇన్విట్‌లలో పెట్టుబడి పెడతారు. ఒకేసారి పెట్టుబడి, సిప్‌ (సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌), ఎస్‌డబ్లూపీ (సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌) ఆప్షన్లు ఈ పథకంలో అందుబాటులో ఉన్నాయి.


మిడ్‌, స్మాల్‌ షేర్లలో

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక వినూత్నమైన పథకాన్ని రూపొందించింది. నిఫ్టీ మిడ్‌ స్మాల్‌ క్యాప్‌ 400 మొమెంటమ్‌ క్వాలిటీ 100 టీఆర్‌ఐ సూచీ ఆధారంగా మిరే అసెట్‌ నిఫ్టీ మిడ్‌ స్మాల్‌ క్యాప్‌ 400 మొమెంటమ్‌ క్వాలిటీ 100 ఈటీఎఫ్‌ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. దాదాపు 90- 95 శాతం నిధులను మిరే అసెట్‌ నిఫ్టీ మిడ్‌ స్మాల్‌ క్యాప్‌
400 మొమెంటమ్‌ క్వాలిటీ 100 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న షేర్లపైనే పెట్టుబడిగా పెడతారు. తద్వారా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లపై పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఈ పథకంపై దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని