అదానీకనెక్స్‌ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎడ్జ్‌కనెక్స్‌ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్‌ 1.44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది.

Published : 29 Apr 2024 02:10 IST

దిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎడ్జ్‌కనెక్స్‌ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్‌ 1.44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. దేశంలో ఇది అతిపెద్ద రుణ ఒప్పందమని కంపెనీ తెలిపింది. వచ్చే మూడేళ్లలో డేటా కేంద్రాల వ్యాపారంపై దాదాపు 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఎడ్జ్‌కనెక్స్‌తో కలిసి 2030కు 1 గిగావాట్‌ సామర్థ్యంతో 9 డేటా కేంద్రాలు నిర్మించే పనిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉంది. తొలుత 875 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకుంటున్నామని, తర్వాత దీన్ని 1.44 బి.డాలర్లకు పెంచుకునే సౌలభ్యం ఉందని కంపెనీ తెలిపింది. ఈ లావాదేవీతో అదానీకనెక్స్‌ నిర్మాణ రుణాల మొత్తం 1.65 బి.డాలర్లకు చేరింది. 8 అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకుంటోంది. ఇందులో ఐఎన్‌జీ బ్యాంక్‌ ఎన్‌వీ, ఇంటెసా సాన్‌పాలో, కేఎఫ్‌డబ్ల్యూ ఐపెక్స్‌, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌, నాటిక్సిస్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌, సోసిట్‌ జనరాలీ, సుమిటోమో మిత్సుయ్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. ప్రస్తుతం అదానీకనెక్స్‌కు చెన్నైలో డేటా కేంద్రం ఉంది. నోయిడా, హైదరాబాద్‌ డేటా కేంద్రాల నిర్మాణం మూడింట రెండొంతులు పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని