కార్పొరేట్‌ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు.

Updated : 29 Apr 2024 05:20 IST

అంతర్లీనంగా సానుకూలతలు
ఔషధ, లోహ, వాహన షేర్లు పెరగొచ్చు
ఐటీ స్క్రిప్‌లకు ప్రతికూలతలు
మహారాష్ట్ర దినం సందర్భంగా మార్కెట్లకు మే1న సెలవు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి. నిఫ్టీ-50కి తక్షణ మద్దతు 22,200 వద్ద ఉండగా.. స్వల్పకాలానికి 22,800 నిరోధంగా మారొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారమూ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు బలహీనపడొచ్చు. గత వారాంతంలో వెలువడ్డ హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర దిగ్గజ సంస్థల ఫలితాల ప్రభావమూ ఉంటుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • ఇటీవలి సానుకూల సంకేతాల మధ్య ఔషధ కంపెనీలు రాణించొచ్చని అంచనా. విశ్లేషకులు సన్‌ఫార్మాపై ‘బేరిష్‌’గా, సిప్లా, దివీస్‌పై సానుకూలంగా ఉన్నారు.
  • టెలికాం షేర్లు సానుకూల ధోరణిలో ఊగిసలాడొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు రోలోవర్‌ కావడం ఇందుకు దోహదం చేయొచ్చు. ఎఫ్‌పీఓకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌పై విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు.
  • బ్యాంకు షేర్లు చాలా తక్కువ శ్రేణిలో ట్రేడవవచ్చు. శనివారం వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ల ఫలితాల ప్రభావం సోమవారం ఉండొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీ 48,500 పాయింట్ల పైన ముగిస్తేనే 49,000-49,500 వరకు వెళ్లొచ్చు.
  • సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. సోమవారం వెలువడే అల్ట్రాటెక్‌ ఫలితాలు ఈ రంగానికి దిశానిర్దేశం చేయొచ్చు. ఈ నెల మొదట్లో కంపెనీలు ప్రకటించిన ధరల పెంపులు ఇంకా ప్రభావం చూపలేదు.
  • లోహ కంపెనీల షేర్లలో సానుకూల చలనాలు కనిపించొచ్చు. సెయిల్‌, హిందాల్కోలపై కన్నేయడం మంచిదని ఒక బ్రోకరేజీ సూచిస్తోంది.
  • ఐటీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీల ఫలితాలన్నీ మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడం ఇందుకు కారణం.
  • చమురు కంపెనీల షేర్లు రాణించొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెద్దగా పెరగకపోవచ్చన్న బలమైన అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.
  • యంత్ర పరికరాల షేర్లు పెరగొచ్చు. అయితే లాభాలు పరిమితంగానే ఉండొచ్చు. పశ్చిమాసియా ప్రభావం ఈ రంగంపై పెద్దగా ఉండదనే అంటున్నారు.
  • నెలవారీ విక్రయాలు, ఫలితాలు బాగుండడంతో వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో ట్రేడవవచ్చు. ఏప్రిల్‌ నెల అమ్మకాల గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి.
  • నెస్లే ఒక్కటే మార్కెట్‌ అంచనాలను మించి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు.

నేటి బోర్డు సమావేశాలు: అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా కెమికల్స్‌, ట్రెంట్‌, యూకో బ్యాంక్‌, బిర్లాసాఫ్ట్‌, కెన్‌ ఫిన్‌ హోమ్స్‌, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌, కేఫిన్‌ టెక్నాలజీస్‌, జిలెట్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, పూనావాలా ఫిన్‌కార్ప్‌, షాపర్స్‌స్టాప్‌, స్పందన స్ఫూర్తి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని