3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్‌ పెట్టుబడులు!

వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్‌ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది.

Published : 29 Apr 2024 02:11 IST

దిల్లీ: వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్‌ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. అపోలో హాస్పిటల్స్‌ అనుబంధ సంస్థ అపోలో హెల్త్‌ కో లో రూ.2475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను అడ్వెంట్‌ రాబోయే రెండున్నరేళ్ల కాల వ్యవధిలో పెట్టనుంది. ఇందులో రూ.890 కోట్లను కొత్త శాఖల ఏర్పాటు, అనువైన సంస్థల కొనుగోలుకు అపోలో వెచ్చించనుంది.

ఏటా అదనంగా 700 పడకలు

రాబోయే మూడేళ్లలో మొత్తం రూ.3000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న అపోలో హాస్పిటల్స్‌, ఏటా దాదాపు 700 ఆసుపత్రి పడకలను జతచేసుకోవాలని నిర్ణయించింది. అడ్వెంట్‌ పెట్టుబడులు రూ.2475 కోట్లలో రూ.860 కోట్లను అపోలో హెల్త్‌ కో విస్తరణకు, మరో రూ.890 కోట్లను అపోలో హాస్పిటల్స్‌ విస్తరణకు వినియోగించాలన్నది ప్రణాళిక. అపోలో హాస్పిటల్స్‌ తన ప్రధాన విపణుల్లో మరింత విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ అఖిలేశ్వరన్‌ తెలిపారు. చెన్నై సమీపంలోని పాత మహాబలేశ్వరం రోడ్డులో 500 పడకల మెడి సిటీ నిర్మించాలన్న ప్రతిపాదన అపోలో హాస్పిటల్స్‌కు ఉంది. ఇందుకు రూ.950 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. అపోలో ఫార్మసీని కూడా మరింతగా విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక.


డిజిటల్‌ హెల్త్‌కేర్‌, ఔషధ పంపిణీల్లో

అపోలో హెల్త్‌కేర్‌ సంస్థకు డిజిటల్‌ హెల్త్‌కేర్‌ (అపోలో 24/7), ఔషధ పంపిణీ వ్యాపారాల్లో వాటాలున్నాయి. ఇవన్నీ కలిపి రాబోయే మూడేళ్లలో రూ.25,000 కోట్ల ఆదాయాన్ని సాధిస్తాయని అంచనా. అపోలో 24/7 కూడా రాబోయే 6-8 త్రైమాసికాల్లో లాభనష్ట రహిత స్థితికి చేరుతుందనే అంచనాలున్నాయి. ప్రైవేట్‌ లేబుల్‌ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థ సామర్థ్యాలు ఇందుకు దోహద పడతాయని కృష్ణన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని