ద్విచక్ర వాహనం కొంటున్నారా?

రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలు ఒక అంతర్భాగం. చాలామంది దీనిని సొంత డబ్బులతోనే కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు రుణంతో తీసుకుంటారు.

Published : 08 Dec 2023 00:23 IST

రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలు ఒక అంతర్భాగం. చాలామంది దీనిని సొంత డబ్బులతోనే కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు రుణంతో తీసుకుంటారు. బ్యాంకులు ద్విచక్ర వాహనాల రుణాలను కాస్త ప్రత్యేకంగానే చూస్తాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన రుణాన్ని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలను చూద్దాం.

చాలామంది ద్విచక్ర వాహనం కొన్నప్పుడే తొలి అప్పు తీసుకుంటారు. అప్పుడే ఉద్యోగంలో చేరిన వారి దగ్గర బండి తీసుకునేందుకు సరిపోయేంత డబ్బు ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి వాహన రుణమే మార్గం. ఇలాంటివారు వాహన రుణం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

  • అర్హత తెలుసుకోండి: రుణదాతలు కనీస స్థూల ఆదాయం, వయసు, నివాస స్థితి వంటి ప్రామాణిక రుణ అర్హతలను పరిశీలిస్తారు. వీటి ఆధారంగానే మీకు ఎంత మేరకు రుణం వస్తుందన్నది నిర్ణయిస్తారు. మీకు ప్రయోజనకరంగా ఉంటూ, మెరుగైన నిబంధనలతో రుణం ఇస్తున్న బ్యాంకును ఎంచుకోవాలి. రుణదాతలు కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్లును ఇస్తుంటారు. ముఖ్యంగా పండగలు, ఇతర సందర్భాల్లో ఇవి ఉంటాయి. వీటిని పరిశీలిస్తూ ఉండాలి.
  • రుణ మొత్తం: బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఎంత మేరకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనేది చూసుకోండి. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేందుకు కొన్ని బ్యాంకులు 100 శాతం రుణాన్ని ఇస్తున్నాయి. మీరు చెల్లించాల్సిన డౌన్‌ పేమెంట్‌, ఈఎంఐ మొత్తం, వడ్డీ రేటు, రుణ వ్యవధి, ముందస్తు చెల్లింపులపై రుసుములు, ఇతర ఛార్జీలన్నీ ఒకసారి చూసుకోండి.
  • పత్రాలు సిద్ధంగా: సాధారణంగా రుణ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, కేవైసీ పత్రాలను అడుగుతారు. వీటన్నింటినీ ముందే సిద్ధంగా ఉంచుకోండి. అప్పుడు వేగంగా రుణం పొందేందుకు వీలవుతుంది.
  • బలమైన క్రెడిట్‌ స్కోరు: అప్పు తీసుకునే ముందే మీ క్రెడిట్‌ స్కోరును ఒకసారి చూసుకోండి. తక్కువ స్కోరుంటే రుణం లభించడం కష్టమవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోరును సాధించాలంటే.. ఇప్పటికే తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించాలి. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉండాలి. అప్పుల సంఖ్య అధికంగా ఉండకూడదు. మీ క్రెడిట్‌ నివేదికనూ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మంచి క్రెడిట్‌ స్కోరు రుణదాతకు మీపై విశ్వసనీయతను పెంచుతుంది.  
  • సులభంగా అందేలా: ద్విచక్ర వాహన విక్రయ కేంద్రాల్లో బ్యాంకుల, ఆర్థిక సంస్థల ఏజెంట్లు, సలహాదారులు అందుబాటులో ఉంటారు. రుణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు వీరు సహాయం చేస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు బ్యాంకులు ముందుగానే రుణ మంజూరు చేస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో ఈ రుణాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
  • వడ్డీ రేట్లు: ద్విచక్ర వాహన రుణాలను అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తుంటాయి. వీటిలో మంచి వడ్డీ రేటుకు రుణం ఇస్తున్నది ఎవరో చూసుకోవాలి. అక్కడి నుంచే రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి.
  • వ్యవధి: సాధారణంగా ద్విచక్ర వాహన రుణాలు 12 నుంచి 60 నెలల వరకూ ఉంటాయి. వీలైనంత వరకూ తక్కువ వ్యవధికే రుణం తీసుకోవడం ఉత్తమం. వడ్డీ భారం తగ్గుతుంది. మీపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలి. నెలవారీ వాయిదాలను నిర్ణయించుకునేటప్పుడు మీ ఆదాయం, ఇతర ఖర్చులనూ చూసుకోండి. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తే.. మీ క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది. భవిష్యత్తులో ఇతర రుణాలు తీసుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

సంజీత్‌ దావర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, క్రిఫ్‌ హై మార్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు