ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి

ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం.

Updated : 15 Feb 2024 06:59 IST

సియామ్‌

దిల్లీ: ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. యుటిలిటీ వాహనాలకు అధిక గిరాకీ ఉండటం ఇందుకు దోహదం చేసిందని భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) వెల్లడించింది. 2022 జనవరిలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 3,46,080 వాహనాలుగా ఉన్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా 11,84,376 వాహనాల నుంచి 26 శాతం పెరిగి 14,95,183 వాహనాలకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం ఇందుకు తోడ్పడిందని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. జనవరిలో వాణిజ్య అమ్మకాల విభాగం రాణించనప్పటికీ.. వచ్చే రెండు నెలల్లో ఈ తరహా వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని అన్నారు. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 48,903 వాహనాల నుంచి 9 శాతం పెరిగి 53,537 వాహనాలకు చేరాయి. ‘ఏప్రిల్‌- జనవరి కాలానికి ప్రయాణికుల వాహనాలు, త్రిచక్ర వాహన విభాగాలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు అమ్మకాలను నమోదు చేశాయ’ని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు. సియామ్‌ గణాంకాల ప్రకారం...

  • జనవరిలో మారుతీ సుజుకీ టోకు విక్రయాలు 1,47,348 వాహనాల నుంచి 1,66,802 వాహనాలకు పెరిగాయి. హ్యుందాయ్‌ మోటార్‌ అమ్మకాలు కూడా 50,106 వాహనాల నుంచి 57,115 వాహనాలకు చేరాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 43,068 వాహనాలుగా ఉన్నాయి. 2023 జనవరిలోని 33,040 వాహనాలతో పోలిస్తే పెరిగాయి.
  • ద్విచక్రవాహనాల విభాగంలో.. మారుతీ సుజుకీ అమ్మకాలు దేశీయ విపణిలో 3,26,467 వాహనాల నుంచి పెరిగి 3,89,752 వాహనాలుగా నమోదయ్యాయి. హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విక్రయాలు కూడా 1,27,912 వాహనాల నుంచి 1,83,638 వాహనాలకు పెరిగాయి. బజాజ్‌ ఆటో జనవరిలో 1,78,056 వాహనాలను విక్రయించింది. గత ఏడాది జనవరిలో అమ్మిన 1,38,860 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే. టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ అమ్మకాలు 1,00,354 వాహనాల నుంచి 1,24,664 వాహనాలకు; సుజుకీ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 65,991 వాహనాల నుంచి 78,477 వాహనాలకు పెరిగాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని