Hero MotoCorp: హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్‌ సైకిల్స్‌

Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది.

Published : 20 May 2024 17:34 IST

Hero MotoCorp | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp), అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌ (Harley Davidson) భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్‌-440 మోటార్‌ సైకిల్‌కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరిన్ని ఏళ్లు కొనసాగించడంతో పాటు ఇతర దేశాలకూ ఇక్కడ తయారుచేసిన మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించి ఓ సంయుక్త ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

దేశీయంగా ప్రీమియం మోటార్‌ సైకిళ్లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దేశీయ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు హీరో-హార్లే భాగస్వామ్యంలో ఎక్స్‌-440 మోడల్‌ వచ్చింది. దీని ధరను రూ.2.4 లక్షలుగా నిర్ణయించారు. బజాజ్‌- ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో స్పీడ్‌ 400 కూడా అదే సమయంలో విడుదలైంది. దీంతోపాటు హార్లే డేవిడ్‌సన్ ఎక్స్‌-440కు సొంత వేరియంట్‌ను మేవ్రిక్‌ బ్రాండ్‌పై హీరో మోటోకార్ప్‌ తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఈ రెండు మోడళ్లకు చెందిన 15 వేల యూనిట్లను హీరో విక్రయించింది. డిమాండ్‌ దృష్ట్యా నెలవారీ తయారీ సామర్థ్యాన్ని సైతం 6 వేల నుంచి 10 వేలకు పెంచింది.

ఒకప్పుడు హార్లే డేవిడ్‌సన్‌ సొంతంగా భారత్‌లో వాహనాలను విక్రయించేది. డిమాండ్‌ లేని కారణంగా 2019లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ముఖ్యంగా దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో దేశీయ మోడళ్లకు ఈ బైక్స్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టింది. ఇందులోభాగంగా దేశీయంగా మోటార్‌సైకిళ్ల తయారీ, విక్రయం, విడి భాగాల విక్రయం వంటివి హీరో మోటో కార్ప్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని మోడళ్లు తీసుకురావడంపై ఇరు కంపెనీలు దృష్టి సారించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని