Indian Economy: 2024లోనూ కొనసాగనున్న భారత వృద్ధి పథం: ఐరాస నివేదిక

Indian Economy: ప్రపంచ దేశాలు తమ సరఫరా గొలుసులను విస్తరిస్తుండడం భారత్‌కు కలిసొస్తుందని ఐరాస నివేదిక తెలిపింది.

Updated : 05 Jan 2024 18:30 IST

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ (Indian Economy) కొనసాగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 2024లో భారత వృద్ధిరేటును 6.2 శాతంగా అంచనా వేసింది. ఈ మేరకు ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2024’ పేరిట ఐరాసలోని ‘ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం’ శుక్రవారం నివేదిక విడుదల చేసింది.

నివేదికలోని కీలకాంశాలివే..

  • భారత వృద్ధి రేటు (Growth Rate) 2024లో 6.2 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసినా.. 2023 అంచనా అయిన 6.3శాతంతో పోలిస్తే ఇది తక్కువ. ఈ ఏడాది వృద్ధికి బలమైన దేశీయ గిరాకీ; తయారీ, సేవల రంగాల నుంచి మద్దతు లభిస్తుంది.
  • చైనాలో ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు.. ప్రైవేట్ పెట్టుబడుల కొరతను పాక్షికంగా భర్తీ చేస్తున్నాయి. అయినప్పటికీ.. స్థిరాస్తి రంగంలోని సవాళ్ల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎదురుగాలులు వీస్తున్నాయి. అందుకు భిన్నంగా భారత్‌లో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, బహుళజాతి కంపెనీల పెట్టుబడుల్లో గణనీయ వృద్ధి నమోదైంది.
  • ఆర్థిక కార్యకలాపాల తీరును తెలియజేసే ‘మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI)’.. 2023 మూడో త్రైమాసికంలో ఒక్క భారత్‌ మినహా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో క్షీణించింది.
  • అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పెట్టుబడులు బలంగా ఉన్నాయి. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్‌లో 2023లో పెట్టుబడుల సెంటిమెంట్‌ బలంగా ఉంది.
  • అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు తమ సరఫరా గొలుసులను వైవిధ్యీకరిస్తున్నాయి (Supply Chain Diversification). దీంతో అనేక దేశాలు భారత్‌ను ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా చూస్తున్నాయి. ఇది భారత్‌కు కలిసొస్తుంది.
  • 2023లోనూ ప్రకృతి విపత్తులు దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. జులై, ఆగస్టులో భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాలు అనావృష్టిని ఎదుర్కొన్నాయి. పాకిస్థాన్‌లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
  • భారత్‌లో ఆగస్టు నెలలో గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాన పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది.
  • ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ GDP వృద్ధి 2023లో 2.7 శాతం నుంచి 2024లో 2.4 శాతానికి తగ్గుతుందని అంచనా.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2023లో మాంద్యం ముప్పు తప్పింది. అయితే, దీర్ఘకాలం తక్కువ వృద్ధిరేటుతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. 2025లో వృద్ధిరేటు 2.7 శాతానికి మెరుగుపడుతుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని