ITR filing: ట్రెండింగ్‌లో #IncomeTaxReturn.. చివరి రోజు భారీగా రిటర్నులు

ITR filing: ఐటీ రిటర్నులు ఫైలింగ్‌కు చివరి రోజు కావడంతో ఐటీ శాఖకు రిటర్నులు పోటెత్తుతున్నాయి. గంటల వ్యవధిలోనే లక్షల మంది రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారు.

Updated : 31 Jul 2023 15:16 IST

దిల్లీ: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు (ITR filing) చివరి రోజు కావడంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్నుల ఫైలింగ్‌కు పోటెత్తుతున్నారు. నేటితో (జులై 31తో) గడువు ముగియనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య గంట వ్యవధిలో ఏకంగా 3.39 లక్షల మంది రిటర్నులు ఫైల్‌ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11.03 లక్షల రిటర్నులు ఫైల్‌ దాఖలైనట్లు పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏవైనా ఇబ్బందులు ఉంటే orm@cpc.incometax.gov.inకు మెయిల్‌ చేయాలని సూచించింది.

మరోవైపు రిటర్నుల దాఖలుకు చివరి రోజు కావడంతో ట్విటర్‌లో ఉదయం నుంచి #IncomeTaxReturn హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. కొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో గడువు పొడిగించాలని ఐటీ శాఖను అభ్యర్థిస్తున్నారు. వర్షం కారణంగా కొందరు రిటర్నులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఊరటనిచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు ఈ హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా కొందరు తమకెదురైన సాంకేతిక ఇబ్బందులను ఐటీ శాఖ దృష్టికి తెస్తున్నారు. ఇంకొందరు మాత్రం చివరి రోజు పన్ను చెల్లింపుదారుల పరిస్థితి ఇదీ అంటూ మీమ్స్‌ రూపొందిస్తున్నారు.

SBI వాట్సాప్‌ సర్వీసులు..సింగిల్‌ క్లిక్‌తో 15కు పైగా సేవలు

ఒకవేళ డెడ్‌లైన్‌లోపు రిటర్నులు ఫైల్‌ చేయకుంటే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 234 ఎఫ్‌ ప్రకారం రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు రూ.1,000; అంతకు మించి ఉన్నప్పుడు రూ.5,000 రుసుము వర్తిస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉన్న వారు.. నెలకు 1 శాతం సాధారణ వడ్డీని సైతం చెల్లించాలి. ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించకుంటే ఐటీ శాఖ నోటీసులను పంపిస్తుంది. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానా విధించడంతోపాటు, చట్టపరమైన చర్యలకూ బాధ్యులవుతారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని