Wagon R Electric: మారుతీ సుజుకీ విద్యుత్‌ వ్యాగన్‌ఆర్‌ ఇదేనా?

జపాన్‌ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్‌ పేరుతో కారు కోసం పేటెంట్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌కు ఇది విద్యుత్‌ వెర్షన్‌ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Updated : 23 May 2024 13:49 IST

దిల్లీ: జపాన్‌ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్‌ పేరుతో కారు కోసం పేటెంట్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌కు (Maruti Suzuki Wagon R Electric) ఇది విద్యుత్‌ వెర్షన్‌ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023 వాహన ప్రదర్శనలో సుజుకీ ఇడబ్ల్యూఎక్స్‌ మోడల్‌ను మొదటిసారి ప్రదర్శించింది. ఇది చూడటానికి వ్యాగన్‌ఆర్‌ డిజైన్‌ మాదిరిగానే ఉంటుంది. ముందువైపు సి ఆకృతి లైట్‌ క్లస్టర్‌లు, ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ కలిగిన బంపర్, చక్రాలు, పక్కన పసుపు షేడ్స్‌ ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్‌తో ఇడబ్ల్యూఎక్స్‌ 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సుజుకీ ఇంతకు ముందు ప్రకటించింది. భారత్‌లో ఈ కారును వ్యాగన్‌ఆర్‌ ఎలక్ట్రిక్‌గా తీసుకువస్తారా, లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో హైబ్రిడ్‌ వాహనాన్ని తీసుకొచ్చేందుకు మారుతీ సన్నాహాలు చేస్తోంది. 2025లో నెక్సా ఛానెల్‌ ద్వారా మొదటి విద్యుత్‌ కారు ఇవీఎక్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో 550 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని సమాచారం. 

మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త కార్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది. హై ఎండ్‌ మోడళ్లకు అధిక గిరాకీ కొనసాగుతోందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) ల్యాన్స్‌ బెనెట్‌ తెలిపారు. కంపెనీ బుధవారం దేశీయ విపణిలోకి లగ్జరీ మోడళ్లు- మేబాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 4మేటిక్‌ ఎస్‌యూవీ, ఏఎంజీ ఎస్‌ 63 పెర్ఫార్మెన్స్‌ ఎడిషన్‌ 1లను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా   రూ.3.35 కోట్లు, రూ.3.3 కోట్లుగా ఉన్నాయి. ప్రత్యేక ఎడిషన్‌ ధర రూ.3.8 కోట్ల నుంచి ప్రారంభమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని