Stock Market: లాభాల్లో మొదలైన మార్కెట్‌ సూచీలు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

Published : 10 Jul 2023 09:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌ తొలి సెషన్‌ను లాభాల్లో మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 19,376 వద్ద, సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 65,439 వద్ద ట్రేడవుతున్నాయి. బిర్లా కార్పొరేషన్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, థర్మోక్స్‌, లిండే ఇండియా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హింద్‌ జింక్‌, ఆక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌, ఐసీఆర్‌ఏ, కల్యాణ్‌ జ్యూవెలర్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడి 82.65 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో కొనసాగుతున్నాయి. ఆటో సూచీ లాభాల్లో ట్రేడవుతోంది. 

బిజినెస్‌ అవుట్‌లుక్‌ సర్వే పేరుతో 180కి పైగా సంస్థలను సర్వే చేసి సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం జూన్‌ విక్రయాల్లో మెరుగైన వృద్ధి కారణంగా సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో 66.1 శాతానికి మెరుగైంది. మార్చి త్రైమాసికంలో ఇది 64 శాతంగా నమోదైంది. జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) వసూళ్లు అధికమవ్వడం, విమాన, రైలు ప్రయాణికుల సంఖ్య పెరగడం వంటి వ్యాపార సంకేతాలు వ్యవస్థలో సానుకూల సెంటిమెంటును ప్రతిబింబిస్తున్నాయి.

సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌, జపాన్‌ సూచీ నిక్కీ నష్టాల్లో ఉండగా.. జపాన్‌కు చెందిన షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ , హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ సూచీ టీఎస్‌ఈఎస్‌ 50 సూచీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని