TATA EVs: కొత్త బ్రాండ్‌తో టాటా విద్యుత్‌ వాహనాలు

TATA EVs: టాటా మోటార్స్‌ తమ విద్యుత్‌ వాహనాలను కొత్త బ్రాండ్‌తో తీసుకురానుంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Published : 29 Aug 2023 14:30 IST

దిల్లీ: విద్యుత్‌ వాహనాలకు ఆదరణ పుంజుకుంటున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి వచ్చే ప్రయాణికుల విద్యుత్‌ వాహనాల (Electric Vehicles- EV)ను ‘టాటా.ఈవీ (TATA.ev)’ పేరిట తీసుకురానున్నట్లు ప్రకటించింది. 2026 నాటికి పది రకాల విద్యుత్‌ వాహనాలను విడుదల చేయాలని కంపెనీ ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని టాటా మోటార్స్‌ (Tata Motors) తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రాండ్‌ నుంచి కార్లలోని ఫీచర్ల వరకు అన్నీ కొత్తగా ఉండాలని ఆశిస్తున్నారని వివరించింది. TATA.ev అనే కొత్త బ్రాండ్‌ తమ విద్యుత్‌ వాహన వ్యాపారానికి కొత్త గుర్తింపునిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. దీంతో తాము కొత్త శకంలోకి అడుగుపెడుతున్నట్లు ‘టాటా ప్యాసెంజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ’ మార్కెటింగ్‌ విభాగాధిపతి వివేక్‌ శ్రీవాస్తవ అన్నారు.

టాటా మోటార్స్‌ (Tata Motors)కు అనుబంధ సంస్థగా ఉన్న ‘టాటా ప్యాసెంజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌’ 2026 నాటికి రెండు బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పది కొత్త విద్యుత్‌ వాహనాల (Electric Vehicles)ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి తమ వాహన విక్రయాల్లో సగం వాటా ఎలక్ట్రిక్‌ వాహనాలదే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ నెక్సాన్‌, టియాగో, టిగోర్‌, ఎక్స్‌ప్రెస్‌-టి వంటి మోడళ్లలో విద్యుత్‌ వేరియంట్లను విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని