Tata Motors: టాటా మోటార్స్‌ ఈవీ ప్లాన్.. 18నెలల్లో ఐదు ఎలక్ట్రిక్‌ వాహనాలు

టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నుంచి భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని ఈవీలను యాక్టి.ఈవీ ఆర్కిటెక్చర్‌ ప్రకారం తయారు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. 

Published : 05 Jan 2024 23:34 IST

దిల్లీ: భారత వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) తయారీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాబోయే 18 నెలల్లో ఐదు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ‘అడ్వాన్స్‌డ్‌ కనెక్ట్‌టెడ్‌ టెక్‌-ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌’ (ACTI.EV) ఆర్కిటెక్చర్‌ను ప్రకటించింది. టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (TPEM) నుంచి భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని ఈవీలను యాక్టి.ఈవీ ఆర్కిటెక్చర్‌ ప్రకారం తయారు చేస్తామని తెలిపింది. 

‘‘భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ఈవీల బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన సీటింగ్‌, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు యాక్టి.ఈవీ ఆర్కిటెక్చర్‌ను డిజైన్‌ చేశాం. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌, ఆధునిక సాంకేతికతతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టాటా ఈవీలు రూపుదిద్దుకుంటాయి. రాబోయే 18 నెలల్లో యాక్టి.ఈవీ ద్వారా ఐదు ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తాం. వీటిలో సింగిల్‌ ఛార్జ్‌తో 300 కి.మీ నుంచి 600 కి.మీ దూరం ప్రయాణ సామర్థ్యం కలిగిన బ్యాటరీల ఏర్పాటు చేస్తాం. పది నిమిషాల ఛార్జింగ్‌తో 100 కి.మీ దూరం వెళ్లొచ్చు. ప్రయాణికుల భద్రత కోసం గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, భారత్‌ ఎన్‌క్యాప్‌ ప్రమాణాలకు అనుగుణంగా కారు డిజైన్‌, సేఫ్టీ ఫీచర్స్‌ ఉంటాయి’’ అని టీపీఈఎమ్‌ హెడ్‌ ఆనంద్‌ కులకర్ణి తెలిపారు.

యూక్టి.ఈవీ ఆర్కిటెక్చర్‌లో తొలి వాహనంగా టాటా మోటార్స్‌ వాహన శ్రేణిలోని కాంపాక్ట్‌ ఎస్‌యూవీ పంచ్‌ (Punch)ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పంచ్‌.ఈవీ కోసం బుకింగ్స్‌ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో రూ.21 వేలు చెల్లించి పంచ్‌.ఈవీని బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని