Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!

వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం.

Updated : 13 Mar 2024 11:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్చి మొదటి నాటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా వేసవి సీజన్‌లో కార్లలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఎండలో నిలిపిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటం.. అద్దాలు బద్దలు కావడం వంటి ఘటనలను తరచూ చూస్తుంటాం. మనం ఏముందిలే అని పట్టించుకోకుండా వదిలేసే చిన్న విషయాలే వీటికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొంటే ఇలాంటివాటిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. 

కారులో మంటలు, పేలుడుకు కారణమయ్యేవి..

సన్‌గ్లాస్‌లు: కార్లు వాడే వారికి సాధారణంగా సన్‌గ్లాస్‌లు ధరించే అలవాటు ఉంటుంది. అలాంటివారు వాటిని డ్యాష్‌బోర్డ్‌పై పెట్టేస్తారు. ఎండలో పార్క్‌ చేసిన సమయంలో అవి భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌ కళ్లజోడు అయితే వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంది. 

స్ప్రే క్యాన్లు: సెంట్లు, రూం స్ప్రేలు వంటి క్యాన్లు ఉంచకూడదు. వీటిల్లోని స్పిరిట్‌ కారణంగా ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆ డబ్బాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఒక దశలో ఇవి పేలే ప్రమాదం ఉంది. 

లైటర్లు: ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు పొరబాటున కూడా లైటర్లను కార్లలో వదిలేయవద్దు. వాహనం ఎక్కువసేపు ఎండలో ఉంటే వీటినుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. 

బ్యాటరీలు: వినియోగించిన పాత లేదా కొత్త బ్యాటరీలను కారు లోపల ఉంచొద్దు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. వీటిల్లోని యాసిడ్లు విషపూరితమైనవి. దీంతోపాటు కారు ఇంటీరియర్‌ దెబ్బతినొచ్చు. 

మేకప్‌ సామగ్రి: మహిళలు వినియోగించే మేకప్‌ సామగ్రిని వాహనాల్లో ఉంచకూడదు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం ఉంటుంది. కొన్ని కరిగిపోయి దెబ్బతినవచ్చు. 

కొవ్వొత్తులు: కొవ్వొత్తులు వంటి వాటిని గ్లాస్‌ కంటైనర్లలో ఉంచి కార్లలో దాచడం ప్రమాదకరం. ఇవి పేలే అవకాశం కూడా ఉంది. 

మద్యం: మద్యం సీసాలు, క్యాన్లు కార్లలో ఉంచి వాటిని ఎండలో పార్క్‌ చేయడం ప్రమాదకరం. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ ఉన్నవి పేలే ప్రమాదం ఉంది. 

హ్యాండ్‌ శానిటైజర్లు: కొవిడ్‌ కారణంగా చాలామంది కార్లలో హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. కానీ, వీటిల్లో ఆల్కహాల్‌ ఉన్నవి అధిక ఉష్ణోగ్రత వద్ద మంటలు సృష్టిస్తాయి. 

మరికొన్ని జాగ్రత్తలు..

  • ఎండలో నిలిపిన కారులో పసి పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దు. ఇది ప్రాణాంతకం. కిటికీలు తీసి ఉంచినా.. లోపల ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరిగిపోతాయి. 
  • సన్‌ క్రీమ్‌లు అధిక ఉష్ణోగ్రతల వద్ద దెబ్బతింటాయి. 
  • ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉంచి ఎండలో పార్క్‌ చేస్తే.. వాటిల్లో బ్యాటరీలు, చిప్స్ వంటి వాటి పనితీరు మందగించవచ్చు. 
  • ఔషధాలను ఉంచొద్దు.. సాధారణంగా చాలావరకు ఔషధాలను గది ఉష్ణోగ్రతల వద్ద సూర్యకాంతికి దూరంగా ఉంచాల్సి ఉంటుంది. 
  • సముద్ర స్నానాలు చేసిన తర్వాత తడిసిన టవల్స్‌ వంటివి ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
  • మొక్కలను ఉంచితే అవి కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే.. వాటిల్లో తేమశాతం పూర్తిగా పడిపోతోంది.  
  • వేసవి సీజన్‌లో ఆహార పదార్థాలను ఉంచడం వల్ల త్వరగా దెబ్బతిని విషపూరితమవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని