
ఆ కేసులో నలుగురికి జీవిత ఖైదు
శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక కోర్టు
దిల్లీ: గతేడాది రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించి నలుగురికి జీవిత ఖైదు విధించింది. ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఐదో వ్యక్తికి ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతిపై హత్యాచారంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తున్న సమయంలో ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వచ్చింది.
అల్వార్‌లోని తనాగాజిలో గతేడాది ఏప్రిల్ 26న నలుగురు వ్యక్తులు సహా ఓ మైనర్.. భర్తను బంధించి అతడి ముందే దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో వ్యక్తి ఆ సంఘటనను చిత్రీకరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంలో పోలీసుల అలసత్వం, అత్యాచారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చేవరకూ స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. కేసు నమోదైన తర్వాత 16 రోజులకు మే 18న పోలీసులు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా మంగళవారం ఆ కేసును విచారించిన న్యాయస్థానం దోషులైన చోటేలాల్ (22), హన్స్‌రాజ్ గుర్జన్ (20), అశోక్‌కుమార్ గుర్జన్ (20), ఇంద్రాజ్‌సింగ్ గుర్జన్ (22)కు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తికి ఐదేళ్ల శిక్ష విధించింది. మైనర్‌ను జువైనల్ హోంకు తరలించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.