Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో 13 మంది ఏపీ వాసులు దుర్మరణం చెందారు.

Updated : 26 Oct 2023 11:10 IST

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి నాగేశ్‌ తెలిపారు. 

దసరా పండగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు ఉండటంతో డ్రైవర్‌ నరసింహులు.. ఆగి ఉన్న ట్యాంకర్‌ గమనించకుండా ఢీ కొట్టాడు. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. 8 మంది చిక్‌బళ్లాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వం ఆదుకోవాలి: నారా లోకేశ్‌

ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా వాసుల మృతి తీవ్రంగా కలచివేసిందని ఆయన ట్వీట్‌ చేశారు. మృతులంతా వ్యవసాయ కూలీలే కావడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని