Shubman Gill: దాదాపు 900 రన్స్‌ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు.

Published : 27 Apr 2024 14:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించే సమయం దగ్గరపడింది. ఏప్రిల్ 30లోగా స్క్వాడ్‌ను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీసీఐ సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తారనే కథనాలూ వస్తున్నాయి. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్ దాదాపు ఫిక్స్‌. బ్యాకప్‌ ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను (Shubman Gill) తీసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. అయితే, తన ఎంపికపై నమ్మకంతో ఉన్నట్లు గిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఒకవేళ సెలక్ట్‌ కాకపోతే ఎవరైనా సరే నిరుత్సాహానికి గురవుతారని వ్యాఖ్యానించాడు. 

‘‘గతేడాది వన్డే ప్రపంచ కప్ ఆడా. భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌లో ఆడాలనే కోరిక నెరవేరింది. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఆడితే మరో కల తీరినట్లే. గతేడాది ఆడిన అనుభవం తప్పకుండా అక్కరకొస్తుందని భావిస్తున్నా. ఒకవేళ నన్ను ఎంపిక చేయకపోతే నిరుత్సాహానికి గురవుతా. అయితే, గతేడాది ఐపీఎల్ సీజన్‌లో దాదాపు 900 పరుగులు చేశా. జట్టులో ఉంటాననే నమ్మకం నాకుంది. ఒకవేళ ఎంపిక కాకపోయినా.. భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటా. ప్రతి ఆటగాడికి మద్దతుగా నిలుస్తా’’ అని గిల్ తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గిల్ 9 మ్యాచుల్లో 304 పరుగులు చేశాడు.

పాండ్య ఆరు సిక్స్‌లు కొట్టగలడు: యువీ

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా కీలకమవుతారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంటర్వ్యూలో హార్దిక్‌కు మద్దతుగా యువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ముంబయి జట్టును నడిపిస్తున్న హార్దిక్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో పాండ్యను వెనకేసుకొచ్చిన యువీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ప్రపంచ కప్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే సత్తా హార్దిక్‌కు ఉంది’’ అని తెలిపాడు. 2007 వరల్డ్‌ కప్‌లో స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్స్‌లు కొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని