Sangareddy: ఆర్గానిక్‌ పరిశ్రమలో ప్రమాదం.. ఆరుకి చేరిన మృతులు

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపుర్‌ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. 

Published : 04 Apr 2024 10:41 IST

హత్నూర: సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు ఇప్పటికే మృతి చెందగా.. తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయసిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌ (38)గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

బుధవారం ఆయిల్‌ బాయిలర్‌ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్‌ రవిశర్మ(38) (హైదరాబాద్‌), కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్‌(48), విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం(36), మధ్యప్రదేశ్‌కు చెందిన సురేష్‌ పాల్‌(54) మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అధికారికంగా ప్రకటించారు. చందాపూర్‌ గ్రామానికి చెందిన చాకలి విష్ణు(35)ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాయాలైన 16 మందిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని