వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు

జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది.

Published : 04 May 2024 06:02 IST

 రూ.23.78 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ వ్యవహారంలో అవినీతి 

ఈనాడు, హైదరాబాద్‌: జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. ఈ శాఖలో డిప్యూటీ కమిషనర్‌(డీసీ)గా నల్గొండలో పనిచేస్తున్న స్వర్ణకుమార్‌, హైదరాబాద్‌లో సహాయ కమిషనర్లు(ఏసీ)గా పనిచేస్తున్న వేణుగోపాల్‌, విశ్వకిరణ్‌, ఉప వాణిజ్య పన్నుల అధికారి వెంకటరమణ, సీనియర్‌ అసిస్టెంటు మహితను పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్‌ జీఎస్టీ కార్యాలయం పరిధిలో రూ.23.78 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ కేసులో అవినీతికి సహకరించినందుకు వీరిని అరెస్టు చేసినట్లు వాణిజ్య పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. నలగండ్లలో నివాసముంటున్న వేమిరెడ్డి రాజా రమేశ్‌రెడ్డి(40) అనే వ్యక్తి ‘వినర్ద్‌ ఆటోమొబైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే కంపెనీకి ఎండీ హోదాలో నకిలీ పత్రాలు సృష్టించి జీఎస్టీని ప్రభుత్వం నుంచి రిఫండ్‌గా తీసుకున్నట్లు వాణిజ్య పన్నులశాఖ విచారణలో తేలింది. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఆగస్టు వరకూ ఈ కంపెనీ పేరుతో ఆటోమొబైల్‌ విడిభాగాలు దిగుమతి చేసుకుని వాటిపై 5 శాతం జీఎస్టీ చెల్లించినట్లు తొలుత నకిలీ బిల్లులు సృష్టించారు. విడిభాగాలతో విద్యుత్‌ బైకులు తయారుచేసి విక్రయించామని వాటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించినట్లు రశీదులు సృష్టించారు. వాటిపై తమకు 13 శాతం జీఎస్టీ వెనక్కి ఇవ్వాలని(రిఫండ్‌) మాదాపూర్‌ జీఎస్టీ కార్యాలయంలో పలు దఫాలుగా బిల్లులు దాఖలు చేశారు. సరిగా తనిఖీ చేయకుండా రూ.23.78 కోట్లకు పైగా రిఫండ్‌ ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో కంపెనీ డైరెక్టర్‌ వి.రామకృష్ణారెడ్డిని గతంలో అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నకిలీ బోగస్‌ బిల్లుల ఆమోదానికి ఆ సమయంలో పనిచేసిన ఐదుగురు ఉద్యోగులు సహకరించినట్లు తేలటంతో అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని