ఏనుగు మృతి: ప్రాథమిక దర్యాప్తు ఏం చెప్తోంది?

కేరళలో ప్రేలుడు పదార్ధాలు నింపిన ఆహారం తిని ఏనుగు మరణించిన ఘటన దేశమంతా అలజడి సృష్టించింది.

Updated : 09 Jun 2020 11:44 IST

దిల్లీ: కేరళలో పేలుడు పదార్ధాలు నింపిన ఆహారం తిని ఏనుగు మరణించిన ఘటన దేశమంతా అలజడి సృష్టించింది. అయితే పలువురు భావిస్తున్నట్టు ఆ ఏనుగుకు ఎవరూ ఉద్దేశపూర్వకంగా హానిచేయలేదని... ఈ ఘటన అనుకోకుండా జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.  ‘‘ఏనుగు యాదృచ్ఛికంగా ఆ కొబ్బరికాయను తిన్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ విషయమై కేంద్ర అటవీశాఖ, కేరళ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... సవివరమైన మార్గదర్శకాలు జారీచేస్తోంది. నేరానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని... ఏనుగు మృతికి దారితీసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాము.’’ అని కేంద్ర పర్యావరణ శాఖ ఓ ప్రకటనలో తెలియచేసింది.

గర్భిణిగా ఉన్న 15 సంవత్సరాల ఆడ ఏనుగు పేలుడు పదార్ధాలున్న పైనాపిల్‌ తినటంతో గాయపడి అనంతరం మరణించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది తిన్నది పైనాపిల్‌ పండు కాదని, కొబ్బరి కాయ అని శవపరీక్షలో తేలింది. అంతేకాకుండా ఆ ఏనుగుకు గాయాలు తగిలి కనీసం రెండు వారాలు అయి ఉంటాయని తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న వారిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అడవి పందులు తమ పంటలను పాడుచేయకుండా నిరోధించేందుకు స్థానికులు పేలుడు పదార్ధాలను నింపిన పండ్లు, ఆహారాన్ని ఎరగా వాడతారు. అయితే ఈ విధానం అక్రమమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ అమానుష చర్యకు పాల్పడిన మిగిలిన వారిని వీలయినంత త్వరగా కనిపెట్టాల్సిందిగా, వన్యప్రాణులపై జరిగే నేరాలను దర్యాప్తు చేసే ప్రభుత్వ సంస్థ- ‘వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో’ ప్రధాన కార్యాలయానికి కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
కాగా, ఈ విషయానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ మంత్రి బాబుల్‌ సుప్రియో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని