Abdullapurmet Case: నేరకథా చిత్రమ్‌!

మిత్రుడిని ఎలాగైనా అడ్డు తొలగించాలి.. ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా పని పూర్తిచేయాలి.. ఫిబ్రవరి 17న బీటెక్‌ విద్యార్థి నవీన్‌(22)ను దారుణంగా హత్య చేసిన నిందితుడు హరిహరకృష్ణ(21) అమలు చేసిన పథకమిది.

Updated : 05 Mar 2023 08:30 IST

క్రైం సినిమాలు, యూట్యూబ్‌ వీడియోలు చూసి నవీన్‌ హత్యకు హరిహరకృష్ణ పథకం
దర్యాప్తులో పోలీసుల గుర్తింపు

ఈనాడు-హైదరాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌-న్యూస్‌టుడే: మిత్రుడిని ఎలాగైనా అడ్డు తొలగించాలి.. ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా పని పూర్తిచేయాలి.. ఫిబ్రవరి 17న బీటెక్‌ విద్యార్థి నవీన్‌(22)ను దారుణంగా హత్య చేసిన నిందితుడు హరిహరకృష్ణ(21) అమలు చేసిన పథకమిది. క్రైం సినిమాలు, యూట్యూబ్‌ వీడియోల ప్రేరణతో వ్యూహరచన చేసి.. స్నేహితుడిని హతమార్చినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా నిందితుడు అంతర్జాలంలో చూసిన వీడియోలు, సినిమాలన్నీ నేరకథా చిత్రాలేనంటున్నారు.

తెల్లవారుజామునే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

దర్యాప్తులో భాగంగా శనివారం తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిందితుడితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. తొలుత నిందితుడిని మూసారాంబాగ్‌లో అతడి సోదరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతడి అక్క, బావల వాంగ్మూలం నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజు పెద్దఅంబర్‌పేట్‌లో మద్యం కొనుగోలు చేసిన, తాగిన ప్రాంతాలకు తీసుకెళ్లి ఆరా తీశారు. మద్యం దుకాణం వద్ద సేకరించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని చూపి.. వాటిలో నవీన్‌, హరిహరకృష్ణల పక్కన ఉన్న వ్యక్తులు పరిచయస్థులా, కాదా అనే వివరాలను నిందితుడి నుంచి రాబట్టారు. అక్కడి నుంచి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, గొడవకు దారితీసిన అంశాలు, నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు, అనంతరం మృతదేహం శరీర భాగాలను వేరుచేయటం తదితర కీలక వివరాలను రాబట్టేందుకు సుమారు గంట పాటు పోలీసులు అక్కడే ఉన్నట్లు సమాచారం. బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో నవీన్‌ శరీర భాగాలను పారవేసిన చోట ఆధారాల కోసం వెతికారు. అనంతరం హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ ఇంటికి వెళ్లారు. శరీరంపై పడిన రక్తపు మరకలను నిందితుడు శుభ్రం చేసుకున్న, దుస్తులు మార్చుకున్న ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. హసన్‌ వాంగ్మూలం తీసుకున్నారు. హరిహరకృష్ణ తన దుస్తులను పారవేసిన సాగర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలోని చెత్తకుండీ ప్రాంతాన్ని, హస్తినాపురం ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమీపంలో యువతిని నిందితుడు కలిసినట్టు చెబుతున్న ప్రాంతాన్నీ పరిశీలించారు. సుమారు 3-4 గంటల పాటు ఆయా ప్రాంతాలకు నిందితుడిని తిప్పుతూ వివరాలు రాబట్టారు. అనంతరం హరిహరకృష్ణను ఉదయం ఎల్బీనగర్‌లోని ఎస్‌వోటీ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. సాయంత్రం 5.30 గంటల తర్వాత నిందితుడిని దర్యాప్తులో భాగంగా ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ కార్యాలయం నుంచి బయటికి తీసుకెళ్లారు.

పదే పదే.. అవే దృశ్యాలు

నిందితుడు సెల్‌ఫోన్‌లో నేరచిత్రాలు చూశాడు. మృతదేహంలోని భాగాలను వేరుచేయటం గురించి యూట్యూబ్‌లో వెతికాడు. వైద్యులు పోస్టుమార్టం చేసే దృశ్యాలను వీక్షించాడు. వాటిని పదే పదే చూస్తూ హత్యకు ప్రేరేపితుడై ఉండొచ్చని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. నిందితుడికి బయటి వ్యక్తులు సహకరించినట్టు నిర్ధారణ అయితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టంచేశారు. హత్య కేసులో యువతి ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు.

నవీన్‌ ఫోన్‌ కోసం ఆరా..

ఘటనకు ముందు నవీన్‌, హరిహరకృష్ణ, యువతి మధ్య జరిగిన సంభాషణలు, ఛాటింగ్‌లను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. యువతి, నిందితుడు తమ ఫోన్లలో సమాచారం తొలగించారు. నవీన్‌ సెల్‌ఫోన్‌ ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. దాన్ని నిందితుడు దాచిపెట్టాడా? ధ్వంసం చేశాడా? లేదా ఇంకెవరికైనా ఇచ్చాడా అనే వివరాలు రాబడుతున్నారు. హత్యానంతరం నిందితుడు వరంగల్‌లోని తండ్రి వద్దకు వెళ్లాడు. అతడిని అక్కడికీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడు తలదాచుకున్న కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగాడు? ఎక్కడ ఆశ్రయం పొందాడనే విషయాలపై ఆదివారం ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు